+ ఇంతలోనే అందరూ చూస్తుండగానే విషాదం. పెళ్లిపీటల మీదే కూర్చున్న నవవధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం మధురవాడలో జరిగింది.
శివాజీ, సృజనలకు ఇరువురి పెద్దలు సంబంధం నిశ్చయించారు. ఇరువురి పెద్దల సమక్షంలో ఇద్దరు ఒక్కటయ్యేందుకు బుధవారం రాత్రి 7 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అనుకున్న ముహూర్తానికి వివాహం జరిపించాలని పెళ్లివేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. వదూవరులిద్దరు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి వధువు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది.
దీంతో కంగారుపడ్డ వధువు బంధువులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు డాక్టర్లు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సృజన మృతి చెందింది. పెళ్లికుమార్తె మృతితో ఇటు వధువు, అటు వరుడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
ఆనందంగా సాగాల్సిన పెళ్లి తంతు బంధువుల రోదనలతో మిన్నంటింది. పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుందనుకున్న కుమార్తె మరణించి శ్మశానానికి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల ఆక్రందనలు ఆకాశాన్నంటాయి. తాళికట్టి జీవితాంతం కలిసి జీవించాలనుకున్న తన చేతిలోనే సృజన మృతి చెందడంతో శివాజీ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అయితే.. సృజన మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.