గత వారంలానే ఈ వీకెండ్ కూడా ఇటు వెండితెరపై, అటు ఓటీటీలో చాలా హంగామా ఉంది. ఎప్పట్లానే థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అయితే వీటిలో చిన్న సినిమానే ఎక్కువ. కాస్త బజ్ తో వస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సన్నాఫ్ ఇండియా మాత్రమే.
లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు నటించిన చిత్రం సన్నాఫ్ ఇండియా. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ మూవీతో మోహన్ బాబు స్క్రీన్ ప్లే రచయితగా కూడా మారారు. గతంలో బుర్రకథ లాంటి డిజాస్టర్ సినిమా తీసిన డైమండ్ రత్నబాబుకు, దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఈ సినిమా ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. అన్నీ తానై మోహన్ బాబు ఈ సినిమా పనుల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. తన కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారాయన.
సన్నాఫ్ ఇండియాతో పాటు బడవ రాస్కెల్, విశ్వక్, సురభి 70ఎంఎం, గోల్ మాల్, విర్జిన్ స్టోరీ, బ్యాచ్, నీకు నాకు పెళ్లంట సినిమాలు వస్తున్నాయి. వీటిలో కాస్త ప్రచారంతో ఊదరగొడుతున్న సినిమా ఏదైనా ఉందంటే అది విర్జిన్ స్టోరీ మాత్రమే. లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా కావడంతో, పబ్లిసిటీకి భారీగా ఖర్చుపెడుతున్నారు. సినిమాకు కూడా భారీగానే ఖర్చు చేశారు.
ఇక ఓటీటీ విషయానికొస్తే, సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన బంగార్రాజు, ఇప్పుడు ఓటీటీ సందడికి సిద్ధమయ్యాడు. ఈ వీకెండ్ (18న) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్నాడు. అటు భారీ తారాగణంతో తెరకెక్కిన 83 సినిమా కూడా ఈ వీకెండ్ నెట్ ఫ్లిక్స్/డిస్నీ హాట్ స్టార్ లో వివిధ భాషల్లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు విశాల్-ఆర్య నటించిన ఎనిమి సినిమా ఈ వారాంతం సోనీ లివ్ లోకి రాబోతోంది. శృతిహాసన్ నటించిన బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్ కూడా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది.