దర్శించే దృష్టి, ఆస్వాదించే మనసు ఉండాలిగానీ మనకు దగ్గర్లోనే బోలెడన్ని టూరింగ్ స్పాట్స్ ఉంటాయి. వీకెండ్ బోరింగ్ కాకుండా రొటీన్ కి భిన్నంగా ప్రకృతిని పలకరించిరావొచ్చు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ముల్లనగిరి పర్వత శ్రేణి అలాంటిదే.
హైదరాబాద్‌కు సుమారు 670 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ అందమైన పర్వతం వీకెండ్స్ లో వెళ్లిరావడానికి బాగుంటుంది. ఇది కర్ణాటకలోని ఉత్తమ ట్రెక్కింగ్ ప్రాంతాల్లో ఒకటిగా పేరుపొందింది. సముద్ర మట్టానికి 6,317 అడుగుల ఎత్తులో ఉండే ముల్లయనగిరి పర్వత శ్రేణి కర్నాటకలోనే ఎత్తైన శిఖరం.
దీంతో ఇక్కడికి నిత్యం సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వీకెండ్స్‌లోనైతే ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది. శిఖరం వద్ద ఉన్న ఒక చిన్న ఆలయం ఉండటంతో ఈ పర్వత శ్రేణికి ముల్లయనగిరి అనే పేరొచ్చింది. శిఖరం సమీపంలోని గుహలో ఒకప్పుడు ముల్లప్ప స్వామి అనే ఋషి ధ్యానం చేశారు. దీంతో ఆయన పేరు మీద ఇక్కడొక గుడి ఉంది.
ముల్లయనగిరి పర్వత శిఖరం పైకి చేరుకోవడానికి విస్తృత ట్రెక్కింగ్ చేయనవసరం లేదు. రోడ్డు మార్గంలోనే అక్కడికి చేరుకోవచ్చు. అయితే, శిఖరం పై వరకు చేరుకోవాలంటే పార్కింగ్ ప్రదేశం నుండి సుమారు 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
అలా పైకి చేరుకున్నాక పర్యాటకులు పశ్చిమ కనుమల అద్భుతమైన వీక్షణలను చూడొచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయ అందాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే చుట్టూ పచ్చదనం కూడా ఆకట్టుకుంటుంది. దీంతో ఏడాది పొడవునా మీరు ఈ ముల్లయ్యనగిరి శిఖరాన్ని సందర్శించవచ్చు.