దసరా హంగామా ముగిసింది. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి రెండు పెద్ద సినిమాలు వచ్చేశాయి. వీటి కోసం ఇన్నాళ్లూ ఆగిన చిన్న సినిమాలు ఇప్పుడు ఒక్కసారిగా క్యూ కట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ వారాంతం ఏకంగా 11 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో కాంతార, గీత సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కన్నడ నాట పెద్ద హిట్టయిన కాంతార సినిమా అదే పేరుతో తెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ మూవీని తెలుగులో కొంతమంది చూశారు. అందరి నోట సూపర్ హిట్ అనే మాట రావడంతో అంచనాలు పెరిగాయి. రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాదు, స్వయంగా ఈ సినిమాకు కథ రాసి దర్శకత్వం కూడా వహించాడు. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమా తీసిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై కాంతార తెరకెక్కింది.
ఈ మూవీతో పాటు థియేటర్లలోకి వస్తున్న స్ట్రయిట్ మూవీ గీత. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. ఇందులో హెబ్బా పటేల్ లీడ్ రోల్ పోషించింది. సినిమాలో ఆమె మూగ అమ్మాయిగా నటించింది. ఓ పాత్రను లీడ్ రోల్ గా పెట్టి, అది కూడా ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టుతో సినిమా తీయడం సాహసమనే చెప్పాలి. అందుకే గీత సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.
ఈ రెండు సినిమాలు తప్పితే మిగతా మూవీస్ పై పెద్దగా అంచనాల్లేవ్. ఆది సాయికుమార్ హీరోగా నటించిన క్రేజీ ఫెలో, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, రుద్రనేత్రి, నీతో, రారాజు, నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా, నిన్నే పెళ్లాడతా, రెబల్, అడవి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ప్రభాస్ నటించిన రెబల్, నితిన్ చేసిన అడవి సినిమాలు రీ-రిలీజ్ కేటగిరీ.