ఎప్పట్లానే ఈ వారం కూడా 5 సినిమాలు థియేటర్ల ముందు క్యూ కట్టాయి. అయితే, ఈ 5 చిత్రాల్లో ఒక్క సినిమా మాత్రమే శుక్రవారం రిలీజ్ అవుతోంది. మిగతా 4 శనివారం విడుదల అవుతున్నాయి. అలా ధనుష్ నటించిన సార్ సినిమాకు సోలో రిలీజ్ దక్కింది.
తమిళ హీరో ధనుష్ నటించిన తొలి తెలుగు చిత్రం సార్. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. విద్యా వ్యవస్థపై తీసిన ఈ సీరియస్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటోంది యూనిట్.
ఇక 18వ తేదీ శనివారం ఒకేసారి 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, కశ్మీర హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాతో పాటు శ్రీదేవి శోభన్ బాబు అనే మరో సినిమా కూడా వస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ హీరో. చిరంజీవి కూతురు సుశ్మిత నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది.
ఇక మిగిలిన రెండు మూవీల్లో ఒకటి ఊ అంటావా మామ ఉఊ అంటావా ఒకటి. రెండోది యాంట్ మ్యాన్. ఊ అంటావా మామ ఉఊ అంటావా అనే సినిమా హారర్-కామెడీ సబ్జెక్ట్. ఇక యాంట్ మ్యాన్ అనేది ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ.