పెద్ద సినిమాల హవా ముగిసి, చిన్న చిత్రాల హంగామా మొదలైన తర్వాత వారానికి కనీసం అరడజను సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్ అయిపోయింది. వీటిలో ఒకటి హైప్ ఉన్న సినిమా ఉంటోంది. మిగతా సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. ప్రతి వారం ఇలానే జరుగుతోంది. ఈ వారాంతం కూడా ఇదే సీన్ కనిపిస్తోంది.
ఈ శుక్రవారం 6 సినిమాలొస్తున్నాయి. వీటిలో బజ్ ఉన్న సినిమా ఒకటే. అదే థాంక్యూ. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా తప్ప, మిగతా చిత్రాలపై పెద్దగా అంచనాల్లేవ్. థాంక్యూ సినిమా విశేషాలతో పాటు.. మిగతా 5 సినిమాల సంగతులపై కూడా ఓ లుక్కేద్దాం.
థాంక్యూ మూవీపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం.. ఇది చైతూ-విక్రమ్ కుమార్ సినిమా. ఇంతకుముందు ఇద్దరూ కలిసి మనం సినిమా చేశారు. అలాంటి క్లాసిక్ తర్వాత థాంక్యూ చేస్తున్నారు కాబట్టి అంచనాలు పెరిగాయి. గడిచిన కొన్ని రోజులుగా సినిమాకు బజ్ కూడా బాగానే పెరిగింది. స్వయంగా నాగచైతన్య రంగంలోకి దిగడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది.
ఓ మనిషి తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ, తన ఉన్నతికి సహకరించిన వాళ్లను మరిచిపోకూడదనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అలా జీవితంలో ఓ ఎత్తుకు చేరిన నాగచైతన్య, జీవితంలో తనకు సహరించిన వ్యక్తులకు థాంక్యూ చెప్పడం ఈ సినిమా స్టోరీ. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఉందంటున్నారు మేకర్స్. అది సినిమా చూస్తే అర్థమౌతుందట.
థాంక్యూతో పాటు థియేటర్లలోకి వస్తున్న సినిమా దర్జా. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించడంతో ఈ ప్రాజెక్టుపై బజ్ ఏర్పడింది. వీళ్లతో పాటు మరో సీనియర్ నటి ఆమని కూడా నటించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోయినా, కంటెంట్ క్లిక్ అయి, మౌత్ టాక్ తో తమ సినిమా ఊపందుకుంటుందని యూనిట్ భావిస్తోంది.
ఇక హన్సిక నటించిన ఓ డబ్బింగ్ సినిమా కూడా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తోంది. దాని పేరు మహా. హన్సిక టైటిల్ రోల్ లో, ఆమె మాజీ ప్రియుడు శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. హన్సిక-శింబు జోడీనే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రచారం కూడా ఆ కోణంలోనే చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏంటంటే.. హన్సికకు ఇది 50వ చిత్రం. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించాడు.
ఈ సినిమాలతో పాటు.. ఈ వారాంతం జగన్నాటకం, హైయ్ ఫైవ్, మీలో ఒకడు అనే మరో 3 సినిమాలొస్తున్నాయి. వీటిలో హైయ్ ఫైవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, అమ్మ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. పైగా ఈ మూవీ ఫంక్షన్ కు రాలేదనే కోపంతో, హీరో నితిన్ ను చెడామడా తిట్టాడు. అలా హైయ్ ఫైవ్ సినిమా అందరి దృష్టిలో పడింది. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ఈ అరడజను సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.