ఆల్రెడీ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మరో వారం రోజుల పాటు ఈ సినిమాకు థియేటర్లు తగ్గవు. మల్టీప్లెక్సుల్లో షోలు తగ్గించడానికి కూడా ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ వారం పెద్దగా సినిమాల సందడి కనిపించడం లేదు. అంతోఇంతో చెప్పుకోదగ్గ మూవీ మిషన్ ఇంపాజిబుల్ మాత్రమే.
తాప్సి నటించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్. టాలీవుడ్ లో తాప్సికి ఇది రీఎంట్రీ మూవీ. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు స్వరూప్ దర్శకుడు. నిరంజన్ రెడ్డి నిర్మాత. ఇందులో తాప్సి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె ఓ మిషన్ ను ఆమె ఎలా పూర్తిచేసిందనేది ఈ సినిమా స్టోరీ. ఈ మూవీతో పాటు సుమన్ నటించిన సేవాదాస్ అనే ఓ చిన్న సినిమా కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.
థియేటర్లలో కనిపించని సందడి ఈవారం ఓటీటీలో కనిపించనుంది. రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాతో పాటు మరిన్ని సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రవీణ్ తాంబే ఎవరు అనే సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ఏప్రిల్ 1న రాబోతోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సోనీ లివ్ లో ఏప్రిల్ 2న స్ట్రీమింగ్ కు రాబోతోంది.
వీటితో పాటు భీష్మపర్వం, మూన్ నైట్, ది లాజ్ బస్ లాంటి చిత్రాలు కూడా ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్ గా ఓటీటీలోకి రాబోతున్నాయి. ఆల్రెడీ స్ట్రీమింగ్ లో దుమ్ముదులుపుతున్న భీమ్లానాయక్ కు ఈ ఓటీటీ సినిమాలు ఏ మేరకు పోటీనిస్తాయో చూడాలి.