నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ఈ విషయంలో న్యాయస్థానం తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని పేర్కొన్నారు.
కానీ ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా? అనే విషయాన్నిఆలోచించాలన్నారు. ఇందులో ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని కూడా ప్రస్తావించడం చాలా అవసరమని వెల్లడించారు. మెజారిటీ ధర్మాసనం నోట్ల రద్దుకు మద్దతు పలికిందన్నారు.
కానీ మైనార్టీ ధర్మాసనం తీర్పు మాత్రం కేంద్రానికి చెంప పెట్టు లాంటిదన్నారు. నోట్ల రద్దు చట్టవిరుద్ధమైన మార్గంలో జరిగిందన్న ధర్మాసనంలో ఓ న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు.
నోట్ల రద్దు చేస్తున్న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. నోట్ల రద్దు చేసేందుకు కేంద్రానికి అధికారం ఉందని ధర్మాసం స్పష్టం చేసింది. కేంద్రం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే డీ మానిటైజేషన్ నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు పేర్కొంది.