హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీని కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సత్కరించారు. నడ్డాను బండి సంజయ్, డీకే అరుణ సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ కార్యవర్గ సమావేశాలకు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితర నేతలు హాజరయ్యారు. బీజేపీ పాలిత 18 రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే బీజేపీ సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపైనా మాట్లాడనున్నారు.
అంతుకుముందు బీజేపీ నేషనల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండాను ఖరారు చేశారు. 2024లో దేశంలో మళ్ళీ అధికారంలోకి రావటం, దక్షిణాదిన బలం పెంచుకోవటం తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చ జరుగనుంది. అలాగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆంధ్ర, తమిళనాడులో పార్టీ బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై చర్చించనున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తీసుకోవాల్సిన కార్యాచరణను కూడా రూపొందించనున్నారు. కేరళలో కార్యకర్తలకు మనోధైర్యం కల్పించటం, ఉత్తరాదిన రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించనున్నారు.