రాజధాని కీవ్ ను విడిచి ఉక్రెయిన్ లోని పశ్చిమ ప్రాంతాలకు వెంటనే చేరుకోవాలని భారతీయ విద్యార్థులకు ఇండియన్ ఎంబసీ మంగళవారం కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు పెద్ద ఎత్తున్న పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు బయలు దేరారు.
ఈ ప్రయత్నంలో భారతీయ విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తాము విశ్వాసం కోల్పోతున్నామని చెబుతున్నారు. ఉక్రెయిన్ లోని భారత రాయభార కార్యాలయం తమకు ఎటువంటి సహాయం చేయలేదని ఆరోపిస్తున్నారు. తమ దారి తాము వెతుక్కుంటున్నట్టు చెబుతున్నారు.
‘ రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు వాహనాలు లేవు. అందువల్ల అందరం కాలి నడకన రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఈ క్రమంలో మేము మొదటి మూడు రైళ్లను ఎక్కలేకపోయాము. కానీ ఎలాగోలా నాల్గవ రైలును ఎక్కగలిగాము. మేము ప్రస్తుతం ఎల్విన్ మార్గంలో ఉన్నాము. ఇప్పటి వరకు అధికారులు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అక్కడికి చేరుకున్న తర్వాత మేము సరిహద్దులను (హంగేరీలోకి) దాటడానికి అధికారులు ఏదైనా ఏర్పాటు చేయగలరని మేము ఆశిస్తున్నాము, ”అని వినిత్ అనే విద్యార్థి చెప్పారు.
‘ రాజధాని కీవ్ ను వదిలి విద్యార్థులంతా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని రాయబార కార్యాలయ అధికారులు సూచించారు. కానీ మాలో చాలా మంది ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థులు ఉన్నారు. మాలో చాలా మంది ఈ దేశానికి ఇటీవల కొత్తగా వచ్చారు. ఇక్కడి నగరాల గురించి మాకు పెద్ద అవగాహన లేదు. ఎటు వెళ్లాలో, ఎలా అక్కడికి చేరుకోవాలో అర్థం కావడం లేదు. మా దారి మేమే వెతుక్కుంటున్నాము. ఎంబసీ అధికారులు వారు భయపడి, మమ్మల్ని భయపెడుతున్నారు” అంటూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి దళాల్ అన్నారు.