వి.ఐ.పి హోదాలో ఉన్న వాళ్లు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్, హోం సెక్రెటరీ కుమారుడు లండన్ లో చదువుకుంటూ ఇటీవలే రాష్ట్రానికి తిరిగొచ్చాడు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆ రాష్ట్రంలో నమోదైన మొట్ట మొదటి కరోనా పాజిటివ్ కేసు ఇదే. అతను చాలా మందితో సన్నిహితంగా మెలగడంతో వారికి కూడా వైరస్ పాజిటివ్ గా తేలే అవకాశం ఉంది. వారందరిని క్వారంటైన్ లో ఉంచి పరిశీలిస్తున్నారు.
ఆ విద్యార్ధి తల్లి రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారి. సెక్రెటేరియట్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండే బిల్డింగ్ లోనే ఆమె ఆఫీస్ ఉంది. ఆ ఐ.ఎ.ఎస్ కుమారుడికి వైరస్ పాజిటివ్ గా తేలిన రోజుకు ముందు రోజే ఆ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ పలు సమావేశాలకు హాజరయ్యారు. ఆమె భర్త కూడా డాక్టర్. అయినప్పటికీ వారు లండన్ నుంచి వచ్చిన తమ కుమారుడికి కరోనా పరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యం వహించారు.
వి.ఐ.పి ల మంటూ కరోనా వైరస పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకోవడం సరికాదని ముఖ్యమంత్రి మమతా అన్నారు. ” మీరు ఎక్కడి నుంచైనా రండి నేను స్వాగతిస్తాను…కానీ నేను రోగాలకు రానివ్వను…సారీ…మీరు ఆకస్మాత్తుగా విదేశాల నుంచి రావడం…పరీక్షలు చేయించుకోకుండా షాపింగ్ మాల్స్ తిరగడం…500 మందికి వైరస్ అంటించడం…నా కుటుంబసభ్యలు వచ్చినా నేను టెస్ట్స్ చేయిస్తా…నేను సపోర్ట్ చేయను” అన్నారు మమతా బెనర్జీ.
బెంగాల్ హోం సెక్రెటరీ సోమవారం అంతా మీటింగ్ లతో బిజీ బిజీగా గడిపారు. ఆ తర్వాత బుధవారం ఆమె కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంట్లోనే ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్ లో ఉంచి పరిశీలిస్తున్నారు.
హోం సెక్రెటరీ కుమారుడు ఇంగ్లాండ్ లోని ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఆదివారం అతను ఇంగ్లాండు నుంచి వచ్చినప్పుడు కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో జరిగిన స్క్రీనింగ్ లో ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ కనిపించలేదు. దీంతో అతని తల్లిదండ్రులు, డ్రైవర్ , ఇద్దరు పని వాళ్లతో కలిసి వెంట తెచ్చుకున్న సామాను తీసుకొని ఇంటికి వెళ్లాడు.
అదే రోజు సాయంత్రం లండన్ నుంచి అతని ఫ్రెండ్స్ ఫోన్ చేసి అతను హాజరైన పార్టీకి వచ్చిన వాళ్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలిందని చెప్పారు. దీంతో కంగారు పడ్డ ఆ యువకుడు వెంటనే బంగూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లగా వారు కరోనా నోడల్ హాస్పిటల్ కు వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే ఆ యువకుడు వెళ్లకుండా మంగళవారం తల్లితో కలిసి వెళ్ళి పరీక్షించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.