కేంద్రానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల ధర్నా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ ధర్నా ముగియనుంది. ఈ రోజు ధర్నాలో ఆమె కేంద్రానికి వ్యతిరేకంగా పాట పాడారు. తన గాత్రంతో బెంగాళీ ప్రజలను ఆమె ఆకట్టుకున్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాథ్ ఠాకూర్ రచించిన పాట ‘ఈ బర్ తో మోరా గంగే’ను ఆమె టీఎంసీ కార్యకర్తలతో కలిసి పాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… తాను ప్రజల కోసం పని చేస్తున్నానన్నారు. వంద రోజుల పనికి డబ్బుల ఆగిపోయిన విషయంలో పోరాడుతున్నానని చెప్పారు.
కేంద్రం డబ్బులు అడ్డుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజల హక్కుల కోసం తాను ధర్నా చేస్తున్నట్టు వివరించారు. అవసరమైతే ప్రధాని మోడీ నివాసం దగ్గర కూడా ధర్నా చేసేందుకు తాను సిద్ధంగా వున్నానని వెల్లడించారు. తనకు ఆ ధైర్యం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమకు నిధులను విడుదల చేయడం లేదని ఆరోపించారు. పనికి ఆహారపథకంతో పాటు అనేక స్కీమ్‌లకు చెందిన నిధులను కేంద్రం రిలీజ్ చేయడంలేదని పేర్కొన్నారు. దీని వెనుక అసూయ, రాజకీయ కారణాలు వున్నాయని తాము భావిస్తున్నామన్నారు.