పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాందీగ్రామ్ పర్యటనలో గాయపడిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆమెపై ఎలంటి కుట్ర జరగలేదని స్పష్టం చేసింది. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారించింది. కేవలం భద్రతాపరమైన లోపాల కారణంగానే ఆమెకు గాయాలు అయ్యాయని వెల్లడించింది. మమత ఫిర్యాదు మేరకు ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు ఈసీ ఈ ప్రకటన చేసింది. మరోవైపు మమతా బెనర్జీకి భద్రత కల్పించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్‌ను సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తికి తగినంత భద్రత కల్పించకపోవడం బాధ్యతా రహిత్యమేనని స్పష్టం చేసిన ఈసీ..డీజీపీ సలహా తీసుకుని ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని పశ్చిమ బెంగాల్ సీఎస్‌కు సూచించింది. మరోవైపు నందీగ్రామ్ పర్యటనకు వచ్చిన మమతకు తగినంత భద్రత కల్పించడంలో విఫలమైనట్టుగా నిర్ధారిస్తూ పూర్బ మేదినీపూర్ ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్‌ను కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.