పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్ కతా నడిబొడ్డున మెగా ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వందలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు వెంట నడవగా రెడ్ రోడ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి రవీంద్రనాథ్ టాగూర్ చిన్ననాటి ఇల్లు జోరాసంకో తకురుబరి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ” మీరు నా ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకుంటే చేస్కోండి…కానీ నా రాష్ట్రంలో పౌరసత్వ చట్టం, ఎన్.ఆర్.సి ని అమలు చేయను” అని మమతా బెనర్జీ అన్నారు.
అంతకు ముందు ర్యాలీపై గవర్నర్ జగదీప్ ధంకర్ స్పందిస్తూ ర్యాలీ రాజ్యాంగ విరుద్ధమని..భావోద్వేగాలను రెచ్చగొట్టేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ముందుండి చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం సరికాదన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యను నిలిపివేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నానని గవర్నర్ ట్వీట్ చేశారు. అయితే గవర్నర్ విజ్ఞప్తిపై మమతా బెనర్జీ స్పందించలేదు.