ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి పరేష్ చంద్ర కుమార్తెను ఉద్యోగం నుంచి కోల్ కతా హైకోర్టు బర్తరఫ్ చేసింది. టీచర్‌గా ఇప్పటివరకు పనిచేసిన కాలానికి పొందిన జీతాన్ని వాపసు చేయాలని కోర్టు ఆదేశించింది. తన కంటే తక్కువ మార్కులు వచ్చినప్పటికీ.. తనను కాదని అంకితా కు ఉద్యోగం ఇచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్ధిని కోర్టులో ఫిటీషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది..
2018 నవంబర్ నుంచి తీసుకున్న వేతనాన్ని రెండు దఫాలుగా హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని అంకితా అధికారిని జస్టిస్ అవిజిత్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆదేశించింది.
కాగా..తన కుమార్తె చట్టవిరుద్ధ నియామకంపై దర్యాప్తు జరుగుతుండడంతో మంత్రి పరేష్.. సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ హైకోర్టు విధించిన గడువును మంత్రి పాటించకపోవడంతో గురువారం సీబీఐ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
2018 లో స్కూల్ టీచర్‌గా తన కుమార్తెను అక్రమంగా రిక్రూట్‌మెంట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి మంత్రి పరేష్ చంద్రను మూడు గంటల పాటు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. కాగా.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ లతో పాటు.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, 120బి కింద మంత్రి, అతని కుమార్తెలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.