మన దేశంలో డ్రోన్ వాడకం అనేది గత కొన్నాళ్లుగా పెరిగింది అనే చెప్పాలి. క్రమంగా వీటి కోసం తీసుకునే అనుమతులతో ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే వీటి నుంచి వచ్చే సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాస్తవానికి డ్రోన్లను వాడడం అనేది చట్టబద్ధంగా చాలా క్లిష్టమైన వ్యవహారం. మన దేశంలో సరిహద్దుల సమస్య కారణంగా డ్రోన్లను ఆయుధాలుగా పరిగణిస్తున్నారు.
మనకున్న తీవ్రవాద ముప్పు దృష్ట్యా ఇది కరెక్ట్ అనే చెప్పాలి. మన దేశంలో డ్రోన్ల అమ్మకం, వాడకాలను డిజిసీఏ నియంత్రిస్తుంది. వారు డ్రోన్లను ఐదు రకాలుగా విభజించి చట్టాలు చేశారు. నానో డ్రోన్లను 50 అడుగుల ఎత్తువరకూ, మైక్రో డ్రోన్లను 200 అడుగుల ఎత్తు వరకూ అనియంత్రిత వాయు మండలం (Uncontrolled Air Space) లో ఎగురవేయడానికి ఏ విధమైన అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
అంతకు మించిన పెద్ద డ్రోన్లను వాడినా, లేక ఇంకా ఎత్తులో ఎగురవేయాలన్నా, లేక నియంత్రిత ప్రాంతాల్లో ఎగురవేయాలన్నా సరే మనకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. డీజీసిఏ వారి DigitalSky పోర్టల్ ద్వారా UAOP (Unmanned Aircraft Operator Permit) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతుల కోసం రూ. 25,000 ఫీజు చెల్లించాలి. మీ డ్రోనుకు UIN (Unique Identification Number) కోసం దరఖాస్తు చేయాలి. నెంబర్ ప్లేట్ మాదిరి డ్రోన్ కు ఫిట్ చేయాలి. లేదంటే మాత్రం దొరికితే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది.