హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు బిడ్డలకు సైనేడ్ ఇచ్చిన తల్లిదండ్రులు తర్వాత వారు కూడా సైనేడ్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారులు ఇద్దరు మెదడు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని తీవ్ర మనస్తాపం చెందిన తల్లిదండ్రులు చివరికి బలవంతంగా తనువు చాలించడం స్థానికంగా ప్రతి ఒక్కరిని కలిచివేసింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన గాదే సతీశ్ (39) కొంతకాలంగా హైదరాబాద్ కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్‌లో నివాసముంటూ బిర్లా సాఫ్ట్‌వేర్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు 12 ఏళ్ల క్రితం వేద (35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబాబు నిషికేత్ (9) స్థానిక భవన్స్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు.
రెండో అబ్బాయి నిహాల్ (5) ఉన్నాడు. కొంతకాలంగా నిషికేత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. నిహాల్ పుట్టినప్పటి నుంచి మూగ, చెవుడు.
ఇద్దరికీ తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. నెల క్రితం నిషికేత్‌ను ఆసుపత్రిలో చూపించగా, చెవినొప్పితోపాటు బ్రెయిన్ క్యాన్సర్‌ను వైద్యులు గుర్తించారు.
ఇద్దరు పిల్లల అనారోగ్య పరిస్థితి గురించి తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు సతీశ్, వేద పిల్లలకు విషమిచ్చి వారూ తాగారు. సతీశ్ బంధువులు శనివారం ఉదయం ఫోన్‌చేయగా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికొచ్చి చూడగా అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.