టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై నిప్పులు చెరిగారు మంత్రి ఆర్ కె రోజా. ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం కోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని పిఎల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్, భరత్, ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉందని.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని.. ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడని.. లోకేష్ కూడా అదే కావాలని కోరుకున్నట్లు ఉందని ఆమె అన్నారు. మంత్రి పెద్ది రెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరగగలడా..అని ఆమె మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటీ చేయండి.. లోకేష్ ఒక పిల్ల పిత్రేగాడు.. మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడని ఆమె ఫైర్ అయ్యారు.దమ్ముంటే ఆధారాలతో రా లోకేష్.. నీ పాదయాత్రకు జనాలు లేరు.. కనీసం పదిమంది కూడా ఉండడం లేదు.. చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ చార్జ్ లూ కూడా లేని పార్టీ వాళ్లది అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా.
లోకేష్ నా వల్ల కాదని జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నాడని.. ఇది చంద్రబాబు పార్టీ కాదు.. ఎన్టీఆర్ పార్టీ అని చంద్రబాబు, లోకేష్ దొంగబతుకు బతుకుతున్నారని విమర్శలు గుప్పించారు. లోకేష్ పాదయాత్ర ఫైయిల్ కావడంతో వారాహితో పవన్ కళ్యాణ్ ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ పై విషయం చిమ్ముతున్నారని ఆమె అన్నారు.