-ఈటల, పొంగులేటి, జూపల్లి భేటీపై..
-కొనసాగుతున్న సస్పెన్స్
-ముగ్గురూ గప్ చుప్..
-భేటీ పై ఎన్నో ఊహాగానాలు
-బీజేపీ పై ఇంట్రెస్ట్ చూపని పొంగులేటి,జూపల్లి
-ప్రత్యామ్నాయాలపై ముగ్గురి మధ్య చర్చ
-ఈటలపై సొంత పార్టీలో అనుమానాలు
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చంతా ఆ ముగ్గురు నేతల రహస్య భేటీ పైనే. అవును మరి హైదరాబాద్ శివారులో ఉన్న ఫామ్ హౌజ్ లో గన్ మెన్లకు సైతం ఎంట్రీ ఇవ్వకుండా.. సుదీర్ఘంగా వారు ముగ్గురు ఏం మాట్లాడుకొని ఉంటారనేది రాజకీయ వర్గాల్లోనే కాదు.. సాధారణ జనంలోను ఉత్కంఠను రేపుతోంది. ఇక ముగ్గురు కూడా చర్చల తరువాత ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలే ఈటలపై పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలు నెలకొనడంతో పొంగులేటి, జూపల్లితో జరిగిన చర్చల్లో వారిని బీజేపీలోకి ఆహ్వానించడం పై చర్చించారా.. లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని సిచ్ఛ్వేషన్ లో ఇన్ డైరెక్ట్ గా ప్రయోజనం కలిగించే ప్రత్యామ్నాయ ప్రయత్నాలపై చర్చించారా.. లేక బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటలే వేరే దాంట్లోకి వెళ్లడం పై మాట్లాడుకున్నారా.. ఇలా వీరి భేటీ పై ఊహాగానాలు చాలానే రేకెత్తుతున్నాయి. అయితే త్వరలో మాత్రం వీరి చర్చల సారాంశం ఏదో ఒక రూపంలో బయటికిరానుంది.
కాగా,గురువారం ఈటల ఫామ్ హౌజ్ లో పొంగులేటి, జూపల్లి ముగ్గురు రహస్యంగా భేటీ అయ్యారు. వీరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇక వీరు తమ తమ పర్సనల్ సెక్యూరిటీతో పాటు గన్ మెన్లను కూడా చర్చలు జరుగుతున్న ప్రదేశానికి అనుమతించకపోవడంతో వీరి భేటీ పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే భేటీ పూర్తి అయిన తరువాత ముగ్గురు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. అంతే కాదు భేటీ గురించి కాని అందులో జరిగిన చర్చ గురించి కాని ముగ్గురు కూడా సైలెంట్ గా ఉంటున్నారు.
అయితే ఈ ముగ్గురి ఉమ్మడి శత్రువైన బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఈ భేటీలో చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి బీజేపీ దగ్గరున్న వ్యూహంపైనా, శక్తి సామర్థ్యాలపైనా ఈటల ఇచ్చిన వివరణతో పొంగులేటి ఇంకా జూపల్లి సంతృప్తి చెందలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చర్చల తర్వాత ఆ ఇద్దరూ బీజేపీలోకి చేరుతున్నారా.. లేక ప్రత్యామ్నాయ ఆలోచన వర్కౌట్ అయిందా అనే దానిపై స్పష్టత లేదు. రానున్న రోజుల్లో సరికొత్త వేదిక రూపుదిద్దుకుంటుందా అన్నది కూడా వీరి భేటీ తర్వాత చర్చనీయాంశంగా మారింది.
అయితే బీఆర్ఎస్ ను ఓడించడానికి బీజేపీ దగ్గరున్న ప్లాన్ పైనే ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ఎన్ని సీట్లలో గెలుపు సాధ్యం, ఓటు బ్యాంకుపై చూపే ప్రభావం, తదితర అనేక అంశాలపై వారి మధ్య డీప్ గానే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం, కేంద్ర నాయకత్వం భరోసా… ఈ అంశాల పై కూడా వారి మధ్య చర్చ జరిగిందని సమాచారం.
ఇక ఈటల ఎంత ప్రయత్నం చేసినా.. బీజేపీ వ్యూహాలపై ఈటల రాజేందర్ వెల్లడించిన అంశాలపై వారిద్దరు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, అందుకే స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది. దీంతో అసంపూర్ణంగా సమావేశం ముగిసింది. మరోవైపు వీరిద్దర్ని బీజేపీలోకి లాగడానికి ఈటల ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అయినా.. దానికంటే భిన్నంగా ఈటల ఇంకేమైనా మాట్లాడా అన్నది ఇప్పుడు అనుమానాలను కల్గిస్తోంది.
దీనిపైనే బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ అనుమానాలకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్బంగా రాష్ట్ర నాయకత్వం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొంత వ్యూహాన్ని సైతం మార్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన కేంద్ర నాయకత్వం దగ్గర ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా, తరువాత స్వయంగా ఈటల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని, బండి సంజయ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.