వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వయనాడ్ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించాలని ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. వయనాడ్ ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందని భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
ఎన్నికల చట్టం ప్రకారం ఏదైనా నియోజక వర్గం ఖాళీగా ఉంటే దానికి ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుందని చెప్పారు. వయనాడ్ స్థానం ఖాళీగా ఉన్నట్టు ఈ నెల 23న తాము గుర్తించామని పేర్కొన్నారు. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందన్నారు.
సూరత్ కోర్టు కూడా పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఇచ్చిందని ఆయన వివరించారు. అప్పటి వరకు తాము వేచి చూస్తామన్నారు. కోర్టు తీర్పు వచ్చాక దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఆప్ కు జాతీయ పార్టీ హోదా ఇచ్చే విషయం అంశం తమ పరిశీలనలో ఉందన్నారు. 2019లో కర్ణాటకలో ప్రధాని మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించింది. ఆయనకు రెండెండ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ గాంధీకి కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన పై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. దీంతో వయనాడ్ స్థానం ఖాళీ అయింది.