కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కి హైకోర్టు నోటీస్ లు జారీచేసింది. ఎన్నికల సమయం లో నరేందర్ రెడ్డి పై నమోదు అయిన ఐటీ కేసుతో పాటు, ఆఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు నరేందర్ రెడ్డి కి నోటీస్ లు జారీ చేసింది. అసలు నరేందర్ రెడ్డి పై ఐటీ కేసు ఎందుకు నమోదు చేసింది, కోస్గి నరేందర్ రెడ్డి ఫాంహౌజ్ ఆరోజు ఏం జరిగింది, నరేందర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు ఏ స్వాధీనం చేసుకున్నారు…? అని తెలుసుకునే ప్రయత్నం తొలివెలుగు.కామ్ చేసింది.
కొడంగల్ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి రేవంత్ పోటీ చేస్తుండడం తో ఎలాగైనా రేవంత్ ను ఓడించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డిని టిఆర్ఎస్ బరిలోకి దింపి, ప్రభుత్వ పెద్దలు అన్నిరకాల సహాయం చేశారు. ఓటింగ్ కు ఇంకా 5రోజులు సమయం ఉంది అనగా నరేందర్ రెడ్డి మామ ఫాంహౌస్, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఉదయం 3 గంటలనుంచి ఐటీ అధికారులు దాడులు చేశారు. సుమారు 12 గంటలపాటు ఫాంహౌస్ లో సోదాలు చేశారు. సోదాలు చేసే సమయంలో నరేందర్ రెడ్డి కూడా ఫాంహౌస్ లోనే ఉన్నారు. ఎన్నికలో ఖర్చు పెట్టడానికి తీసుకొచ్చిన 25 కోట్ల డబ్బులు, 4కోట్ల విలువ చేసే మద్యంతో పాటు ఒక డైరీ ని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ లీడర్ కు ఎంత, పోలీస్ ఆఫీసర్లకు ఎంత ఇచ్చింది డైరీ లో రాసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. డైరీలో 6 కోట్లకు సంబంధించిన లెక్కలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఐటీ దాడి కొడంగల్ లో పెను సంచలనం సృష్టించింది. టిఆర్ఎస్ నేతలు కూడా దీన్ని ఖండించలేదు. ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కూడా ఐటీ దాడులను ధ్రువీకరించారు.
ఐటీ కేసుతో పాటు మరికొన్ని అంశాలతో రేవంత్ కోర్టు మెట్లు ఎక్కారు. నరేందర్ రెడ్డి అఫిడవిట్ లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు. షాబాద్ లో నరేందర్ రెడ్డి కి పెట్రోల్ పంపు ఉంది, కానీ అఫిడవిట్ లో అది ఎక్కడ చూపించలేదు. దాంతో పాటు ఎన్నికలో పోటీకి విదేశాల నుంచి విరాళాలు తీసుకోవద్దు. నరేందర్ రెడ్డి మాత్రం తనకు అమెరికా నుంచి 5లక్షలు విరాళాలు వచ్చాయి అని ఎన్నికల ఖర్చులో చూపించారు. తనకు ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించిన సమాచారం కూడా తప్పుగా చూపించారని రేవంత్ ఫిర్యాదు చేసారు.
రేవంత్ ఫిర్యాదును విచారణకు తీసుకున్న కోర్టు నరేందర్ రెడ్డి కి నోటీస్ లు జారీ చేసింది. పూర్తి సాక్షాలతో రేవంత్ ఫిర్యాదు చేసారని, నరేందర్ రెడ్డి తప్పించుకోలేరని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.