కాగితాల మీద కథ బలంగా నడిపిస్తున్నారు. కాని కనికరం చూపిస్తున్నట్లే కనపడుతోంది. కనికరం చూపిస్తున్నారంటే కహానీ హస్తినలో నడిచిందనే అనుమానం వస్తోంది. అదే సమయంలో కాటు వేసే ముందు కనికరం చూపించడం కామన్ అనే వాదన కూడా వినపడుతోంది. సీబీఐ – జగన్ వీరిద్దరి మధ్య సాగుతున్న దాగుడుమూతలు ఎవరికీ అర్ధం కావడం లేదు. శుక్రవారం రావడం కుదరదంటే.. చాలా స్ట్రాంగ్ గా రివర్స్ గేర్ లో వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది సీబీఐ. కాని అదే సీబీఐ మూడు వారాలుగా జగన్ హాజరు కాకపోయినా..ఏమీ మాట్లాడటం లేదు. అన్ని ఛార్జిషీట్లు కలిపి ఒకే కేసుగా మార్చి.. విచారణ త్వరగా పూర్తి చేయాలన్న జగన్ రిక్వెస్ట్ ను డోంట్ కేర్ అంది. మరోవైపు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి కూడా కోర్టుకు రాని జగన్ బెయిల్ రద్దు దిశగా అడుగులు పడుతున్నదీ లేనిదీ తెలియడం లేదు.
11 ఛార్జిషీట్లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. కంపెనీలు, ఐఎఎస్ ఆఫీసర్లు, అప్పటి మంత్రులు.. ఇలా ఎందరో ఈ కేసులో ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి విచారణ సాగుతూ ఉంది. రాజకీయాలకు, ఈ కేసుకు టెక్నికల్ గా లింక్ లేకపోయినా..లాజికల్ గా చాలా లింక్ ఉంది. వైసీపీవారు అయితే.. ఈ కేసులు రాజకీయంగా పెట్టినవే అని వాదిస్తూ ఉంటారు. పెట్టిన కేసులు ఏ ఉద్దేశంతో పెట్టినా.. ఇక్కడ అసలు విషయం లేకుండా.. వారు కూడా ఏమీ చేయలేరన్నది వాస్తవం. అంటే సార్ చేతితో వ్యవహారం నడిచింది కాబట్టే.. కేసులు అంత బలంగా పెట్టగలిగారన్నది అందరికీ తెలిసిన విషయమే.
అసలు ఇప్పుడేం జరుగుతోంది? శుక్రవారం ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు చెప్పినా.. ఏదో ఒక కారణం చూపుతూ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు డుమ్మా కొట్టేస్తున్నారు. విచారణ కూడా జరపకుండా వాయిదాలు పడుతున్నాయి. జగన్ హాజరు కావాల్సిందేనన్న కోర్టు ఈ విషయంలో ఖచ్చితంగానే ఉంది.. ఆయన రానిదే విచారణ జరపటం లేదు. ఒకవైపు విచారణ త్వరగా పూర్తి చేయాలన్న మనిషి.. వాయిదాలు వేయడానికి కారణమవుతూ తానే ఆలస్యం చేస్తున్నారు. అదే విచిత్రంగా ఉంది.
ఇప్పటికే.. జగన్ బెయిల్ రద్దవుతుందని.. జైలుకు వెళతారని.. పైగా కేసు త్వరగా పూర్తి చేసి శిక్ష కూడా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైట్ కాలర్ నేరాలపై సీరియస్ గా ఉందనే క్యాంపెయిన్ నడుస్తోంది. దీనికనుగుణంగానే నేతల పార్టీల ఫిరాయింపులు, ప్రభుత్వ పాలసీలు అన్నీ నడుస్తున్నాయనే అనుమానాలూ ఉన్నాయి.
ఒకవేళ అదే నిజమైతే.. మూడువారాలు రాని జగన్ ను.. అదీ ఒక వారం హైదరాబాద్ లో ఉండి మరీ హాజరు కాని జగన్ ను సీబీఐ కోర్టు ఎందుకు ఉపేక్షిస్తోంది? కేంద్రంలోని పెద్దలతో జగన్ ఏమైనా మాట్లాడుకుని, సీబీఐకి చెప్పించుకున్నారా అనే అనుమానం కూడా వినపడుతోంది. కాని సీబీఐ కోర్టులో పెడుతున్న నివేదికలను చూస్తుంటే ఆ అనుమానం నిజం కాదనిపిస్తోంది. ముఖ్యమంత్రి అయ్యాకే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువనే వాదనను సీబీఐ చాలా బలంగా చెప్పింది. అంతే కాదు.. 11 ఛార్జిషీట్లు ఎందుకు పెట్టామో..అవి ఎన్ని రకాల కేసులో.. చాలా వివరంగా చెప్పింది సీబీఐ. అన్నీ కలిపి విచారించాలన్న జగన్ వాదనను గట్టిగా ఎదుర్కొంది. ఇవన్నీ చూస్తుంటే.. ఉచ్చు బిగుస్తున్నట్లే కనపడుతోంది. సీబీఐ తన నివేదికల్లో పేర్కొన్నవాటిని బలంగా ఎస్టాబ్లిష్ చేస్తే.. సీబీఐ కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకుంటే శిక్ష పడటం ఖాయం. కాని ఏం జరుగుతుందో.. ఏ జరగబోతుందో అంతా సస్పెన్స్.