హిందూ సాంప్రదాయంలో అయితే పెళ్లి చేసుకోబోయే వారి జాతకాలు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటికి తగిన విధంగా ముహుర్తాలను నిర్ణయిస్తారు. ఆ ముహుర్తాలకే పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. ఇక ఇతర వర్గాలకు చెందిన వారు కూడా తమకు అనుకూలమైన సమయాల్లో పెళ్లిళ్లను చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వధూ వరుల బ్లడ్ ఏ గ్రూపు ? ఇద్దరికీ ఒకే రక్తమా ? వేర్వేరా ? అనే విషయాలను ఎవరూ గమనించరు. కానీ నిజానికి అవి కూడా చాలా కీలకమే. ఎందుకంటే…
సాధారణంగా బ్లడ్ గ్రూప్‌లలో పాజిటివ్, నెగెటివ్ అని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎ, బి, ఎబి, ఒ.. ఇలా గ్రూప్ ఏదైనా వాటిల్లో ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ (Rh+) అని నెగెటివ్ (Rh-) అని ఉంటాయి. అయితే భార్యాభర్తల్లో ఈ ఫ్యాక్టర్ ఇద్దరికీ పాజిటివ్ ఉంటే ఏమీ కాదు, కానీ భర్తకు ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండి, భార్యకు ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ నెగెటివ్ ఉంటే.. పిల్లలకు ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో తల్లి కడుపులో ఉన్న బిడ్డ రక్తం ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది కనుక.. ఆ రక్తం తల్లి రక్తంతో కలిస్తే అప్పుడు ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ నెగెటివ్ ఉండే తల్లి రక్తంలో యాంటీ బాడీలు తయారవుతాయి. దీంతో ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న బిడ్డ రక్తంలో ఎర్ర రక్త కణాలను సదరు యాంటీ బాడీలు నాశనం చేస్తాయి. దీని వల్ల బిడ్డకు తీవ్రమైన రక్తహీనత సమస్య రావచ్చు. అలాగే కొన్ని సార్లు మెదడు దెబ్బతినేందుకు, ఇంకొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయేందుకు కూడా అవకాశం ఉంటుంది.
కనుక పెళ్లి చేసుకోబోయే వారు తమది ఏ బ్లడ్ గ్రూప్, ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివా, నెగెటివా.. అని చెక్ చేసి మరీ పెళ్లి చేసుకోవడం మంచిది. ఇద్దరి రక్తంలోని ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏమీ కాదు. కానీ ఒకరి ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండి, మరొకరి ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ నెగెటివ్ ఉంటే మాత్రం.. పుట్టబోయే బిడ్డకు సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.