‘ప్రధాని మోడీని జాతిపిత అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ అభివర్ణించడంపై బీహార్ సీఎం నితీష్ కకుమార్ ఎద్దేవా చేశారు. ఈ దేశానికి మోడీ ఏం చేశారని ఆయనను ‘జాతిపిత’ గా వ్యవహరించాలని ప్రశ్నించారు. బీజేపీ గానీ, ఆర్ఎస్ఎస్ గానీ దేశ స్వాతంత్య్ర పోరాటానికి తనవంతు కృషిగా చేసిందేమీ లేదని, తన తండ్రి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన నిన్న వ్యాఖ్యానించారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన ముగిసిన తరువాత తాను జన్మించినప్పటికీ అన్ని విషయాలూ తమకు తెలుసునని అన్నారు. ‘మహాత్మా గాంధీ చేసిన సేవలను మనం విస్మరించగలుగుతామా ? కొత్త జాతిపితగా మోడీని అభివర్ణిస్తున్నారు గానీ, ఆయన దేశానికి చెప్పుకోదగిన సేవ ఏదైనా చేశారా .. ఇండియా ఎలా అభివృద్ధి చెందింది? కొత్త టెక్నాలజీలో ప్రగతి సాధించింది తప్ప’ అని నితీష్ కుమార్ పేర్కొన్నారు. మీడియా రంగానికి ఇప్పటికీ స్వేచ్చ లేదని.. విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మోడీని నూతన జాతిపితగా అమృతా ఫడ్నవీస్ ఇటీవల నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసించడంపై ఇప్పటికే అనేకమంది విపక్ష నేతలు విమర్శలతో చెలరేగిపోయారు. మోడీని ఇలా గాంధీజీతో పోల్చడం ఆయనను అవమానించడమేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ఇండియాలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని, అలాంటిది ఈ తరుణంలో మోడీని గాంధీతో పోల్చడం దారుణమని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడరాదని ఆయన పరోక్షంగా హితవు చెప్పారు.