పనిమీద బైటకెళ్తాం. మధ్యలో నేనున్నానంటూ వాష్ రూమ్ అర్జెన్సీ వస్తుంది. జెంట్స్ అయితే చటుక్కున ఏ చెట్టుచాటుకో,గోడ చాటుకో వెళ్ళి పనికానిస్తారు. ఆడవాళ్ళు ఈ ఇబ్బందిని ఇంటికెళ్ళేవరకూ పంటిబిగిన భరిస్తారు. ఇలాంటి సమస్యల్ని దృష్ఠిలో ఉంచుకుని ఆయాకార్పోషన్లు మొబైల్ వాష్ రూమ్స్ ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల ఓలా, ఉబర్ సర్వీసుల మాదిరిగా మొబైల్ వాష్ రూమ్ యాప్స్ కూడా సిటీలైఫ్ లోకి ఎంటరైపోతున్నాయి.
ఏంటీ..! ఏదీలేనట్టు టాపిక్ అంతా వాష్ రూమ్ చుట్టే తిరుగుతుంది అనుకుంటున్నారా.?! మరి ఇదే నేచర్ కాల్ ఆట మధ్యలో క్రికెటర్స్ కి వస్తే పరిస్థితి ఏంటనేది చర్చ.
అవునండీ..ఈ పాయింట్ నాకు తట్టలేదు సుమండీ.! అని మీకూ అనిపిస్తోంది కదా.?! సందర్భార్హం కాకపోయినా దీనిగురించి తెలుసుకుంటే ఓ పనైపోతుంది కదా ఏమంటారు.!?
క్రికెట్ కానీ,మరి ఏ ఇతర క్రీడల్లోనైనా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒకసారి ఆట కోసం మైదానంలోకి అడుగు పెట్టాక, వాళ్లు అవుట్ అయితే, లేదా మధ్యలో దెబ్బతగలడం వంటివి జరిగితే తప్ప మైదానం విడిచి వెళ్ళడానికి ఉండదు.
కానీ వాష్ రూమ్ ఎమర్జెన్సీకి మాత్రం ఈ రూల్ మినహాయింపే. అంటే సాధారణంగా ఇలాంటి సందర్భాలు ఎదురవ్వవు. ఎందుకంటే క్రికెట్ ఆడేటప్పుడు ఆ క్రికెటర్ శరీరంలో ఉన్న నీరు అంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అంతే కాకుండా మధ్యలో డ్రింక్స్ బ్రేక్ లాంటివి ఉన్నప్పుడు ప్లేయర్ కి వాష్ రూమ్ కి వెళ్లే అనుమతిని ఇస్తారు.
అలాగే ఒక ప్లేయర్ తన ఇన్నింగ్స్ మొదలయ్యే ముందే వాష్ రూమ్ కి వెళ్లి వస్తాడు. కానీ ఒకవేళ ఆట మధ్యలో వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తేకూడా ఆ ప్లేయర్ వెళ్ళచ్చు.
ఇలాంటి సందర్భమే ఒకసారి ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని వాష్ రూమ్ కి వెళ్ళగా, ఆయన స్థానంలో కోహ్లీ బాధ్యతలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 44 వ ఓవర్ లో ధోని వాష్ రూమ్ కి వెళ్లి 45 ఓవర్ ముగియగానే వచ్చారు.
తర్వాత ఒక ఇంటర్వ్యూలో “ధోనీ మ్యాచ్ మధ్యలో బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?” అని టీమిండియా మేనేజర్ బిశ్వరూప్ దేయ్ ని అడిగినప్పుడు, “ధోనీ వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది” అని సమాధానం చెప్పారు. అలా ఆటల్లో కూడా వాష్ రూమ్ ఎమర్జెన్సీ ఉంటే రూల్స్ సడలింపు ఉంటుంది. కంగారు పడి కంటతడి పెట్టాల్సిన పనిలేదు.