కొవిడ్ మహమ్మరి ఇంకా ప్రపంచాన్ని వీడి పోలేదు. నిత్యం ఏదో మూల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా కొవిడ్ లక్షణాలను కొన్ని జంతువులలో కూడా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మొట్టమొదటిసారిగా జంతువుల కోసం అనొకోవాక్స్ అనే టీకాను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయడం విశేషం.
హర్యానాలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీనిని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. ఇది క్రియారహితమైన సార్స్ కోవ్ -2 డెల్టా వ్యాక్సిన్. జంతువుల్లో రోగనిరోధక శక్తిని పెంచి డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లకు ఈ టీకా చెక్ పెడుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) పేర్కొంది.
కుక్కలు, చిరుత, సింహాలు, ఎలుకలు, కుందేళ్లు కరోనా బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ టీకాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో నరేంద్ర తోమర్ మాట్లాడుతూ… ఈ అనొకోవాక్స్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశంలో సొంతంగా అభివృద్ధి చేయడం చాలా అభినందనీయం అని.. శాస్త్రవేత్తలు అలుపెరగని పోరాటంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.
గతంలో హైదరాబాద్ సహా పలు జంతుప్రదర్శన శాలల్లోని సింహాలు, పులులు కరోనా బారిన పడ్డాయి. పెంపుడు కుక్కలకు కూడా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలోనే జంతువుల్లో కరోనాను ఆరికట్టేందుకు అనొకోవాక్స్‌ను అందుబాటులోనికి తీసుకొచ్చారు.