రాజకీయ వర్గాల్లోనే కాకుండా, తెలంగాణ ప్రజల్లో కూడా ఇప్పుడు వినిపిస్తున్న మాట క్లౌడ్ బరస్ట్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణమని దీని వెనుక విదేశీ కుట్ర ఉందని అన్నారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. అసలు.. ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..? నిజంగా భారీ వర్షాలను కురిపించొచ్చా..? ఇలా నెట్టింట అందరూ శోధిస్తున్నారు.
వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఒక చిన్న ప్రాంతంలో అంటే ఓ పది కిలోమీటర్ల లోపు ఉండే ప్రదేశంలో.. గంటలో 10 సెంటీమీటర్లు గానీ.. అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు ఇది జరుగుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్ లో జరిగినట్లుగా భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే.. కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేమంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ లు ఎక్కువగా జరుగుతుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో భారీ వర్షాన్ని కురిపిస్తాయి. మనదేశంలో ఇప్పటిదాకా కొండ ప్రాంతాల్లోనే ఈ మాట ఎక్కువగా వినపడేది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో కురిసిన వర్షానికి విదేశీ కుట్ర ఉందేమోనని అనడం చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఇది సాధ్యమేనా? క్లౌడ్ బరస్ట్ కు అవకాశం ఉందా? అదికూడా తెలంగాణలో చేయడం. ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
నిజానికి ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం. రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ.. ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది గమనించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.