ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మ్యాజిక్ చేయడంతో భారత్ ఆ మ్యాచ్ లో గెలుపొందింది. ఈ క్రమంలో చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే నిజానికి మ్యాచ్ ఆరంభంలో చాహల్ ఫైన్ 11 మందిలో లేడు. కానీ జడేజాకు గాయం కావడంతో అనూహ్యంగా జట్టులోకి కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్ గా వచ్చిన చాహల్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే చాహల్ జట్టులోకి రావడం వివాదాస్పదంగా మారింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు ఫిల్ హ్యూస్ ఓ దేశవాళీ మ్యాచ్‌లో ఓ బౌలర్ విసిరిన బౌన్సర్‌కు గాయం బారిన పడ్డాడు. మెడకు తీవ్రమైన గాయం కావడంతో అతను మైదానంలోనే స్పృహ తప్పాడు. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించి 3 రోజుల పాటు చికిత్స అందించారు. అయినప్పటికీ హ్యూస్ చనిపోయాడు. దీనికి తోడు పలు అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ బ్యాట్స్ మెన్ కు బౌలర్లు విసిరే బౌన్సర్ల వల్ల మెడ, తలకు గాయాలు అవుతున్నాయి. దీని వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ఐసీసీ క్రికెట్ రూల్స్‌ను మార్చింది.
మ్యాచ్ సందర్భంగా ఎవరైనా బ్యాట్స్‌మెన్ తలకు లేదా మెడకు గాయమైతే అతను తిరిగి మ్యాచ్ ఆడే పరిస్థితి లేకపోతే అతనికి బదులుగా సేమ్ అతని లాంటి స్కిల్స్ కలిగిన ప్లేయర్లనే టీమ్‌లు జట్టులోకి తీసుకుని వారిని ఆడించవచ్చు. అంటే ఒక బ్యాట్స్‌మెన్ ఉదాహరణకు బౌలింగ్ కూడా చేస్తాడనుకుంటే అతనిలాంటి ఆల్ రౌండర్‌నే సబ్‌స్టిట్యూట్‌గా టీమ్‌లు జట్టులోకి తీసుకురావాలి. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మెడకు గాయం కాగా అతనిలాంటి ఆల్ రౌండర్ భారత జట్టులో లేకపోవడంతో స్పిన్నర్ చాహల్‌ను మ్యాచ్‌లోకి తెచ్చారు. జడేజా కూడా స్పిన్నర్ కనుక ఆల్ రౌండర్ కాకపోయినా మ్యాచ్‌లో తదుపరి జడేజా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంది కనుక చాహల్ స్పిన్నర్ అని చెప్పి మ్యాచ్ లోకి తీసుకున్నారు. ఇక ఆ విషయానికి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ దీనిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్, కోచ్ జస్టిన్ లాంగర్‌లు అభ్యంతరం తెలిపారు.
Advertisements
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఫించ్, లాంగర్ లు డేవిడ్ బూన్‌తో వాగ్వివాదం జరిపారు. రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్ కనుక అలాంటి ప్లేయర్‌నే ఇండియా జట్టులోకి తేవాల్సిందని, అది మరిచిపోయి కేవలం స్పిన్నర్ అయిన చాహల్‌కు ఎలా అనుమతిచ్చారని వారు డేవిడ్ బూన్‌తో వాదించారు. ఈ సందర్భంగా వారు తమ అసంతృప్తిని కూడా వ్యక్త పరిచారు. అయితే ఆశ్చర్యంగా కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చిన చాహల్ 3 కీలక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశాడు. దీంతో భారత్ విజయం సునాయాసం అయింది. ఇదే ఆసీస్‌కు మింగుడు పడడం లేదు. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, కొనసాగుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.