మార్కెట్‌లో మనకు ప్రస్తుతం సాధారణ ఉప్పుతోపాటు హిమాలయన్ సాల్ట్ అని కూడా లభిస్తోంది. సాధారణ ఉప్ప కన్నా హిమాలయన్ సాల్ట్ ను వాడితే ఎంతో మంచిదని, దీంతో అనేక లాభాలు ఉంటాయని సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో అనేక సైట్లలో చెబుతున్నారు. అయితే ఇంతకీ అసలు హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటి ? దాంతో నిజంగానే లాభాలు ఉంటాయా ? అంటే…
హిమాలయ పర్వతాల సమీపంలో ఉండే గనుల నుంచి హిమాలయన్ సాల్ట్‌ను తీస్తారు. ఇందులో సాధారణ ఉప్పుతో పోలిస్తే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల హిమాలయన్ ఉప్పు మనకు ఎరుపు రంగులో కనిపిస్తుంది. అయితే మినరల్స్ ఉన్నంత మాత్రాన ఈ ఉప్పుతో లాభాలు కలుగుతాయని చెప్పలేం. ఎందుకంటే ఆ మినరల్స్ చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. అంటే మనకు నిత్యం కావల్సిన మినరల్స్ ఈ ఉప్పు ద్వారా లభించాలంటే మనం నిత్యం 1.7 కిలోల ఉప్పును తినాలి. అలా తినలేం కదా. కనుక ఈ ఉప్పును తినప్పటికీ మనకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఏండదు. అందులో సూక్ష్మ పరిమాణంలో ఉండే మినరల్స్ మన శరీరానికి ఏమాత్రం సరిపోవు. అందువల్ల పోషకాల పరంగా హిమాలయన్ సాల్ట్ మనకు ఎలాంటి లాభాలను ఇవ్వదు.
ఇక హిమాలయన్ సాల్ట్‌లో కన్నా సాధారణ ఉప్పులోనే సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. 1 టీస్పూన్ సాధారణ ఉప్పులో 2300 మిల్లీగ్రాముల సోడియం లభిస్తుంది. అదే 1 టీస్పూన్ హిమాలయన్ సాల్ట్‌లో 2000 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా సోడియం అందుతుంది. అయితే మనం నిత్యం 2300 మిల్లీగ్రాములకు పైగా సోడియం తీసుకోవాలి. కనుక హిమాలయన్ సాల్ట్‌ను ఎక్కువగా తినాల్సి వస్తుంది.
ఇక హిమాలయన్ సాల్ట్‌ను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మ సమస్యలు పోతాయని చెబుతారు. అలాగే ఈ ఉప్పును వాడడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని, శరీరం పీహెచ్ నియంత్రణలో ఉంటుందని, వృద్ధాప్య ఛాయలు త్వరగా రావని, నిద్రలేమి సమస్య తగ్గుతుందని, శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని.. ఇలా రకరకాలుగా వెబ్‌సైట్లలో కథనాలు కనిపిస్తుంటాయి. కానీ నిజానికి వీటిలో దేనికి కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల హిమాలయన్ ఉప్పు కూడా సాధారణ ఉప్పు లాంటిదేనని, దానికి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే హిమాలయన్ ఉప్పులాంటిదే మరొక ఉప్పు ఉంది. అదే బ్లూ సాల్ట్. ఇది పర్షియాలో లభిస్తుంది. అందులో మినరల్స్ ప్రభావం వల్ల అది బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. కానీ హిమాలయన్ సాల్ట్, బ్లూ సాల్ట్ ఏదైనా సరే స్ఫటికాల రూపంలో ఉంటే మనకు ఆయా రంగుల్లో కనిపిస్తాయి. కానీ వాటిని చూర్ణం చేస్తే ఇతర ఉప్పులాగే తెల్లగా కనిపిస్తాయి.