ఇండియాలో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంస్థలకు శాపంగా పరిణమించిన హిండెన్ బెర్గ్ రిపోర్టు భారత ఆర్ధిక వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ స్థానాన్ని ఏడో స్థానానికి దిగజార్చేసింది. ఈ రిపోర్టుతో కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు రూ. 10 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూశాయంటే.. ఇది జారవిడిచిన ‘బాంబు’ సాధారణమైనది కాదని తెలుస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో అదానీ గ్రూపుల షేర్ల విలువ నాలుగు లక్షల కోట్లకు పైగా ఆవిరయిపోయింది.
హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తోంది. 2017 లో నాథన్ ఆండర్సన్ అనే వ్యక్తి సృష్టించినదే ఈ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా బడా వ్యాపార సంస్థలు సాగిస్తున్న ఆర్ధిక మోసాలు, పన్నుల ఎగవేత, అవకతవకలు, డొల్ల కంపెనీల గుట్టుమట్లు తదితరాల ఫ్రాడ్ ను ఎండగట్టి బహిర్గతం చేయడమే దీని పని, షార్ట్ సెల్లింగ్ లో కూడా ఈ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. స్టాక్ మార్కెట్ లోని ప్రతి లావాదేవీలో ముందు కొనుగోలు చేయడం, తరువాత దాన్ని అమ్మడం, లేదా ముందు అమ్మడం, ఆ తరువాత కొనడం వంటివి పరిపాటి. షేర్లను కొనుగోలు చేసి దాని విలువ పెరిగాక అమ్మి లాభం పొందవచ్చు.. అంటే రెండో విధానమే బెటరని అదానీ గ్రూప్ భావించినట్టు కనబడుతోంది. షేర్లను తక్కువ ధరకు కొనడం, అనంతరం అధిక ధరకు అమ్మడం.. ఇది మంచి లాభాలనిస్తుంది. ఈ రెండో పద్ధతినే షార్ట్ సెల్లింగ్ అంటుంటారు.
అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ పట్టా అందుకున్న నాథన్ ఆండర్సన్.. ఒకప్పుడు ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం లో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేశాడంటే నమ్మలేం. కానీ అతని విద్య అతడ్ని మళ్ళీ అమెరికా వచ్చేలా చేసింది. ఫ్యాక్ట్ సెట్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసిన ఈయన. అప్పటికే హారీ మార్కో పోలస్ అనే వ్యక్తితో కలిసి ప్లాటినం పార్ట్ నర్స్ సంస్థ జరిపిన ఫ్రాడ్ పై ఇన్వెస్టిగేట్ చేశాడు. ఆ తరువాత తానే హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్ధను ఏర్పాటు చేశాడు. 2020 లో అమెరికా లోని నికోలా కార్పొరేషన్ ని ఆయన టార్గెట్ చేసుకున్నాడు. ఆ సంస్థ అవకతవకలు బయటపడడంతో దాని స్టాక్ విలువ 40 శాతం పడిపోయింది.
2017 నుంచి ఇప్పటివరకు మొత్తం 16 కంపెనీల మోసాలను హిండెన్ బెర్గ్ బయటపెట్టింది.
జర్మనీకి చెందిన ప్యాసింజర్ ఎయిర్ షిప్ పేరే హిండెన్ బెర్గ్.. 1937 మే 6 న న్యూజెర్సీ లోని మాంచెస్టర్ టౌన్ షిప్ వద్ద ఇది ప్రమాదానికి గురి కాగా ఆ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. 62 మందిని సహాయక బృందాలు రక్షించాయి. తమ సంస్థకు ఈ పేరు పెట్టడానికి కారణాన్ని వివరించిన ఆండర్సన్.. ఇది మనిషి పూర్తిగా సృష్టించిన విపత్తు అని, మండే స్వభావం ఉన్న హైడ్రోజన్ నింపిన బెలూన్ లో 100 మందిని ఎక్కించారని, ఇలా మానవులు సృష్టించిన ప్రమాదాలు మార్కెట్లలో సంభవిస్తే వాటిని కనుక్కుని.. వీటినుంచి బాధితులను ఆప్రమత్తం చేసి వారిని రక్షించడానికే తాము పూనుకొన్నామని చెప్పాడు. నాడు జర్మనీకి, అమెరికాకు మధ్య 10 షెడ్యూల్డ్ ట్రిప్స్ పై 1,002 ప్యాసింజర్లను ఈ ఎయిర్ షిప్ తరలించింది.ఒక దశలో ఆ బెలూన్ కి ఒక్కసారిగా నిప్పంటుకుని మంటల్లో మండిపోయింది.