– ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి
– కొత్త అప్పులకు నో ఛాన్స్
– సంక్షేమ పథకాలు నడుపుదామా?
– లేక.. ఉద్యోగుల జీతాల్లో కోత పెడదామా?
– కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
– ఇప్పటికే రైతు బంధుపై కొత్త నిబంధనలు?
తెలంగాణ మరో శ్రీలంకగా మారుతుందనే ఆందోళన రాజకీయ విశ్లేషకుల నుంచి రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తోంది. కొత్తగా అప్పులు పుట్టడం లేదు.. ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు.. సంక్షేమ పథకాలకు నిధులు కావాలి..? ఏం చేయాలా? అని కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నారని చెబుతున్నారు. కేంద్రం వల్లే ఇదంతా అని టీఆర్ఎస్ వర్గాలు అంటుంటే.. మొన్న తెలంగాణ పర్యటనలో అప్పులు ఎందుకు? కేసీఆర్ కుటుంబానికా? అని అమిత్ షా విమర్శించారు. అయితే.. కొత్తగా అప్పులు పుట్టకపోతే సంక్షేమ పథకాలకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఓ ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు.
ఈమధ్య ఫైనాన్స్ అధికారులతో కేసీఆర్ సమావేశమైనప్పుడు.. ఉద్యోగులకు సగం జీతం ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాలు తగ్గిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో ఉద్యోగులు త్యాగం చేయాలనే చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే.. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినా.. కేంద్రం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది.. రాష్ట్రంపై వివక్ష కారణంగా జీతం ఇవ్వలేకపోతున్నామనే దాన్ని వారికి వివరిస్తే గట్టున పడొచ్చనే ప్రతిపాదన కేసీఆర్ చేసినట్లుగా వివరిస్తున్నారు. కానీ.. ఎంత చెప్పినా.. ఉద్యోగులు ఊరుకుంటారా? త్యాగం చేస్తారా? అనేది పెద్ద ప్రశ్న.
ఇప్పటికే రైతు బంధు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈసారి అమలులో చాలా నిబంధనలు తీసుకొస్తున్నారని.. అలా భారాన్ని కొంతవరకన్నా తగ్గించాలని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇటు అసెంబ్లీ ఏర్పాటు చేసి.. కేంద్రం వల్లే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందనే విషయాన్ని వివరిస్తూ.. తదుపరి కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. తాము పెద్దగా అప్పులు చేయలేదని కేటీఆర్ అంటున్నారు.. కేంద్రమేమో రూల్స్ కు మించి చేశారని అంటోంది. కార్పొరేషన్ అప్పులు, ఇతర అప్పులు కలిపి చెబుతోంది. అయితే.. ఏపీలో కొత్త అప్పులకు అవకాశం ఇస్తున్నారు.. ఆదాయం తక్కువున్న రాష్ట్రానికి ఇస్తూ.. తెలంగాణకు ఎందుకివ్వరనేది టీఆర్ఎస్ ప్రశ్న.
తాము కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టే.. కొత్తగా అప్పులు పుట్టనివ్వడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టి.. కేంద్రం వల్లే ఇదంతా.. అనే విషయాన్ని ప్రమోట్ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా వివరిస్తున్నారు. అయితే.. అప్పులు చేస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చిందనే దాని చుట్టూ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయని అంటున్నారు.