– కేసీఆర్ పై జాతీయ నేతలకు నమ్మకం లేదా?
– మమత,స్టాలిన్,అళగిరి వంటి నేతలనిశ్శబ్ధం
– ఇటీవలే లెఫ్ట్ నేతలతోనూ మంతనాలు
– తాజాగా కేసీఆర్ కు హ్యాండిచ్చిన లాలూ తనయుడు
– బీజేపీతో అంటకాగడం వల్లే నమ్మకం పోయిందా?
– కేసీఆర్ గురించి అంతా తెలిసిపోయిందా?
ఊ అంటే..ఆ అంటే కేంద్రంపై యుద్ధమనే కేసీఆర్ కు టైం కలిసొస్తున్నట్టుగా కనిపించటం లేదు. నేను కాలుపెడితే ఢిల్లీలో భూకంపమే అంటూనే..పదే పదే ఢిల్లీ వెళ్లటం, ప్రధాని నుంచి అన్ని మంత్రిత్వశాఖలతో సుహృద్భావ సమావేశాలు, శాలువాలతో సత్కరించుకోవటాలు.. ఓ వారం పాటు హస్తినలో అన్నీ చక్కదిద్దుకుని హైదరాబాద్ తిరిగిరావటాలు వంటి చర్యలను దేశంలోని పార్టీలన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కొనసాగుతున్నప్రతిష్టంభన చూస్తుంటే.. వివిధ రాష్ట్రాల నేతలు కేసీఆర్ ను అంతగా నమ్ముతున్నట్టు అనిపించటం లేదని విశ్లేషకుల భావన.
గత ఏడేళ్ల టీఆర్ఎస్ పార్టీ పోకడలు, పార్లమెంట్ లో వివిధ సందర్భాల్లో, వివిధ కీలకమైన బిల్లుల సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీల తీరు అన్నీ విశ్లేషిస్తున్నారు.సాగు చట్టాలపైనా ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించటం కూడా కేసీఆర్ సర్కార్ కు మైనస్ అయినట్టు సమాచారం.మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నిపార్టీలు పార్లమెంట్ లో ఏకమైన ప్రతిసారీ, టీఆర్ఎస్ మాత్రం మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.అలాంటిది తనకు నచ్చినప్పుడు థర్డ్ ఫ్రంట్ పెడదాం..కేంద్రంపై యుద్ధం చేద్ధాం అని కేసీఆర్ గొంతెత్తి అరుస్తుంటే నమ్మే పరిస్థితి లేదనేది రాజకీయ పండితుల భావన.
మరోవైపు దక్షిణాదిలో బలం పెంచుకుంటున్న బీజేపీ..తెలంగాణపై కన్నేసినట్టు తాజా పరిణామాలే తెలియచేస్తున్నాయి. రైతు సమస్యల నుంచి నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల దాకా కేసీఆర్ పై సమరశంఖం పూరించటమే గాకుండా.. నడ్డా స్థాయి నాయకులు కేసీఆర్ కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేయటం కేసీఆర్ కు తలనొప్పిగా మారిందనేది మరికొందరి అంచనా. అయితే..ఏదిఏమైనా ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ధర్నాపై బలప్రయోగం..అరెస్టు లాంటి వన్నీ ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమే అనేవారూ లేకపోలేదు. తెలంగాణలో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ బలం పుంజుకుంటుందనే భయంతోనే…ఏ చిన్నఛాన్స్ ఇవ్వకుండా యుద్ధం డ్రామా నడుస్తుందనే మాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నట్టు సమాచారం. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి కాబట్టి.. వాళ్లు కేసీఆర్ బీజేపీ మిత్రబంధంపై ఓ కన్నేసి ఉంచినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే.. కేసీఆర్ మూడో ఫ్రంట్ ఎప్పటికప్పుడు మూన్నాళ్లముచ్చటగానే మిగిలిపోతూ వస్తోందని భావిస్తున్నారు.