ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ రైతు రాజ్యం తెస్తానంటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ దోచుకున్న డబ్బు తాత్కాలికమేనని అన్నారు. రైతులకు బేడీలు వేసిన విషయం కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ రైతు రాజ్యంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని అడిగారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా 16 లక్షల మంది రైతుల ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని అన్నారు. రైతులు బయట అధిక వడ్డీలకు డబ్బు తెచ్చుకుని అప్పుల పాలయ్యారని ఆరోపించారు. పంట నష్టపరిహారం,మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రైతుల దగ్గర మిల్లర్లు వడ్లు కొన్నాక..ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోందని, ఈ పద్ధతి రైతుకు నష్టం చేసి, మిల్లర్లకు మేలు చేయడమే అని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని చెప్పే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారో లెక్కలు ఎందుకు చెప్పడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,దళితులకు మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి జరిగిందని, దీనిపై చర్చకు సిద్దమా అని పొన్నాల కేసీఆర్ కు సవాలు విసిరారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించిన పొన్నాల బీఆర్ఎస్ జెడ్పీటీసీ గొడ్డలితో నరుకుతా.. అంటూ రోడ్డుపై తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఎంత డబ్బు దోచుకున్నా అది శాశ్వతం కాదని..మిషన్ కాకతీయలో కావల్సినంత దోపిడీ చేశారని.. ఇక మిగిలింది ఏం లేదని పొన్నాల ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పై మండిపడ్డ ఆయన ఇతర పార్టీల్లోని నేతలను చేర్చుకోవడం సిగ్గుచేటు అన్నారు.