– ప్రశాంత్ కిశోర్ భవితవ్యం ఏంటి?
– సొంత పార్టీ పెడుతున్నాడా?
– ఒకవేళ పెడితే.. రాష్ట్రానికే పరిమితమా?
– దేశ రాజకీయాలపై దృష్టి పెడతాడా?
– బీహార్ లో వరుస భేటీలకు ప్లాన్
– గురువారం కీలక అనౌన్స్ మెంట్ ఉందా?
ఆయన బుర్ర నిండా రాజకీయమే. ఏదైనా పార్టీకి పనికి కుదిరాడంటే ఆ లీడర్ ను హైప్ చేసేందుకు ఎన్నో చేస్తుంటాడు. ప్రజలు అంతకుముందెన్నడూ చూడనివెన్నో చూడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ పొలిటికల్ బుర్ర ఎవరిదనేగా మీ డౌట్. ఆయనే ప్రశాంత్ కిశోర్. పీకేగా అందరికీ పరిచయం అయిన ఇతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నాడు. రాజకీయ ఓనమాలు దిద్దిన బీహార్ నుంచే దీన్ని మొదలుపెట్టనున్నాడు.
ఇన్నాళ్లూ వెనకుండి నడిపించిన పీకేకు మొదట్నుంచి రాజకీయం చేయాలనే ఆలోచన ఉంది. నితీష్ కుమార్ జేడీయూలో కీలక పాత్ర పోషించాడు. ఉపాధ్యక్షుడిగా ఉంటూ యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్నాడు. జేడీయూలో నితీష్ తర్వాత సెకండ్ ప్లేస్ పీకేదేనని అంతా భావించారు. కానీ.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంతో నితీష్, పీకేల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో 2020 జనవరి 29 పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు ప్రశాంత్ కిశోర్. అప్పటినుంచి సైలెంట్ గా ఉంటూనే ఇతర పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తూ వస్తున్నాడు.
పీకే కాంగ్రెస్ లో చేరుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. చర్చలు కూడా ఓ రేంజ్ లో జరిగాయి. మళ్లీ కాంగ్రెస్ కు పూర్వవైభవం ఎలా తీసుకురావాలనే దానిపై వారం రోజులపాటు మంతనాలు సాగాయి. కానీ.. చివరకు పీకే పెద్ద ట్విస్టే ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరడం లేదని స్పష్టం చేశాడు. అయితే.. ఆయన ఆలోచన సొంత పార్టీ పెట్టే దిశగానే సాగుతోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా పీకే చేసిన ట్వీట్ బీహార్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
తన రాజకీయ ప్రయాణం బీహార్ నుంచే ఉంటుందని తెలిపాడు పీకే. ప్రజలకు అవసరమైన పాలసీల తయారీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని.. ఇప్పుడు రియల్ మాస్టర్ గా మారే సమయం వచ్చిందని అన్నాడు. అంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు జన్ సురాజ్ పేరుతో వస్తున్నానని చెప్పాడు. దీంతో ఆయన సొంత పార్టీ కన్ఫామ్ అనే వార్తలు వస్తున్నాయి.
మూడు రోజుల కిందట వరుసగా కొన్ని ఛానల్స్ కు ఇంటర్యూలు ఇచ్చాడు పీకే. ఆ సమయంలో 2024 ఎన్నికల్లో తన పాత్ర కచ్చితంగా రాజకీయ నాయకుడిగానే ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే.. అది ఎలా అనేది తనకు తెలియదన్నాడు. కానీ.. ఆయన అలా సమాధానం చెప్పడానికి ముందే ప్రత్యేక పార్టీ ఆలోచనను ఖరారు చేసుకున్నట్లుగా తాజా ట్వీట్ తో అర్థం అవుతోందని అంటున్నారు రాజకీయ పండితులు. ఆదివారం పాట్నాలో అడుగుపెట్టిన పీకే.. నాలుగు రోజులపాటు అక్కడే ఉంటాడని.. కొన్ని భేటీలు ఉంటాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేయడానికి గురువారం బీహార్ లో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వార్తలు ప్రసారం అవుతున్నాయి.
నిజానికి పీకే ఓ వంద మందిని ముందుగానే రంగంలోకి దింపారని అంటున్నారు. అలాగే పీకే రానున్న రోజుల్లో ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తాడని సమాచారం. ముఖ్యంగా డాక్టర్లు, న్యాయవాదులు, టీచర్లు సహా పలువురిని కలవననున్నాడు. అయితే.. బీహార్ తన కార్యక్షేత్రం అని చెబుతున్న పీకే రాష్ట్రానికే పరిమితం అవుతారా? లేక.. పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేస్తారా? అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. బీహార్ కు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడప్పుడే లేవు. 2025లో ఉన్నాయి. ఆలోపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. 2024 ఎన్నికల్లో రాజకీయ నేతగానే కీలకంగా వ్యవహరిస్తానని చెప్పిన పీకే.. కచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి పెడతారని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అతను పని చేసిన పార్టీల మద్దతు ఎలాగూ ఉంటుంది కాబట్టి.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే.. ఇతర పార్టీలకు బంగారు బాతుగా కనిపించే పీకే.. సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుంది.. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే.. బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ బలంగా ఉన్నాయి. ఆ పార్టీలను కాదని పీకే రాణించడం కష్టమనే చెబుతున్నారు.
ఇక బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని కోనార్ పీకే సొంతూరు. తండ్రి శ్రీకాంగ్ పాండే వైద్యుడు. వృత్తి రీత్యా బక్సార్ లో కుటుంబం నివాసముండేది. అక్కడే పీకే రాజకీయ పాఠాలు చదువుకున్నాడు. రాజకీయాల్లోకి రాకముందు పీకే ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు. 2013లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నన్స్ ను కూడా స్థాపించాడు.