సీమంతం” హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు జరిపించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి ఇది. ఆడవారికి జరిగే 16 జాతక కర్మల్లో ఒకటి సీమంతం. దీనికి మరో పేరే జన్మ సంస్కారం. గర్భవతిగా ఉన్న ఏడో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ చేయడం జరుగుతుంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి రోజు నుంచీ శిశువు కి ప్రాణ శక్తి ఉన్నా కూడా, మెదడుకు సంభందించిన చైతన్య శక్తి 7 వ నెల నుంచి వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు అన్నీ సరిగ్గా తెలియడం స్టార్ట్ అవుతాయని అంటారు.
ఆ రోజున తల్లి కి చక్కగా మంగళ స్నానం చేయించి ఆ తర్వాత జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి, కాళ్ళకి పసుపు, నుదుట కుoకుమ పెట్టి, తలనిoడా పూలు అలంకరించి, కొత్త చీర కట్టి కూర్చోబెడతారు. కొన్ని చోట్ల హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆడవారందరూ చేరి, ఆమెకి, గంధం రాసి, కొత్త గాజులు వేసి, తమ వెంట తెచ్చిన కానుకలు అన్నీ ఇస్తారు. చీరలు, తినుబండారాలు ఇందులో ముఖ్యం. తల్లినీ , కడుపు లో ఉన్న బిడ్డని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం అన్నమాట. ఫంక్షన్ పూర్తయిన తర్వాత మంగళహారతి ఇస్తారు.
మానసికం గా తల్లిని ప్రసవానికి సిద్ధం చేయడం ఈ సీమంతం ప్రధాన ఉద్దేశం. అంతమంది ముత్తైదువులు… అందులో పిల్లల తల్లులే ఎక్కువగా ఉంటారు. వారిని చూసి ఆమెకు భయం తగ్గుతుంది. ఇంత మంది ఆడాళ్ళు ప్రసవం తర్వాత కూడా సంతోషంగా ఉన్నారని ఆమెకు ఒక నమ్మకం. ఇక మరో కారణం… సీమంతం చేసే వరకు అమ్మాయి అత్తవారింట్లో ఉంటుంది. ఇక అప్పటి వరకు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు… ఇక నుంచి కొన్ని నెలల పాటు మేము చూసుకుంటామని చెప్తూ పుట్టింటికి తీసుకు వెళ్తారు.
పుట్టింట్లో పిండవంటలు, తీపి పదార్థాలు తెచ్చి తమ సంతోషం బయట పెడతారు. అత్తగారి ఇంటి నుంచి వచ్చే స్వీట్స్ ను అందరికి పంచి… పరోక్షంగా చెప్తారు… మా అమ్మాయి ప్రసవం రెండు కుటుంబాలు కలిపి తీసుకున్న బాధ్యత అని. అప్పుడు అమ్మాయికి ఒక ధైర్యం వస్తుంది నా వెనుక పుట్టినిల్లు, మెట్టినిల్లు ఉన్నాయని. ఈ సమయంలో అమ్మాయి వాళ్ళ అమ్మ, అత్తగారు ఇద్దరూ ఒక్కో చీర కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞత బయట పెడతారు.
ALSO READ: