మన తెలుగు సంస్కృతిలో భోజనానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు ప్రతీ ఆహార పదార్ధానికి విలువ ఇస్తారు. ముఖ్యంగా వెజ్ లో ఉండే ఆహార పదార్ధాలకు సంబంధించి పెద్దలు వాటి ఆరోగ్య, రుచికరమైన అంశాలను చక్కగా వివరించారు. ఇక మనం భోజనానికి సంబంధించి పంచభక్ష్య పరమాన్నాలు అనే మాట వింటూ ఉంటాం. అసలు దానికి అర్ధం ఏంటీ అనేది చాలా మందికి తెలియదు.
Also Read:ప్లీజ్… ఆ పాత్ర మీరే చేయండి సార్.!
మంచి భోజనాన్ని మన పెద్ద వాళ్ళు పంచభక్ష్య పరమాన్నాలు అని అంటూ ఉంటారు. ముందుగా పంచభక్ష్యాలు అంటే ఏంటీ అనేది చూస్తే… మనం తినే పదార్థాలు అయిదు రకాలు ఉంటాయి.
భక్ష్యం అంటే… కొరికి తినేవి అని అర్ధం. అంటే గారెలు, బూరెలు, అప్పాలు సహా మొదలైనవి ఆ కేటగిరిలో వస్తాయి.
భోజ్యం అంటే నమిలి తినేవి అని అర్ధం. పులిహోర, దద్ధోజనం సహా పలు రకాల ఆహార పదార్ధాలు దీని కిందకు వస్తాయి.
చోష్యం అంటే జుర్రుకునేది అని అర్ధం. పాయసం, దప్పళం, చారు సహా మొదలగునవి దీని కిందకు వస్తాయి.
లేహ్యం అంటే… నాకబడేవి అని అర్ధం. తేనె, బెల్లం పాకం, చలివిడి లాంటివి దీని కిందకు వస్తాయి.
పానీయం అంటే తాగేవి అని అర్ధం. నీళ్ళు, కషాయం, పళ్ల రసం, నిమ్మ రసం వంటివి దీని కిందకు వస్తాయి.
ఇక ఒక్కొక్క పదార్ధానికి ఒక్కొక్క శాస్త్రీయ కారణం ఉంది అనేది పెద్దల మాట. భక్ష్యం / భోజ్యం అనేవి పళ్లు గట్టిగా అవటానికి మరియు బలం చేకూరుస్తాయి. చోష్యం అనేది ఆకలి పెంచి, జీవక్రియకి దోహదపడుతుంది. లేహ్యంను ఒక రకంగా మల్టీ విటమిన్ గా చెప్తారు. పానీయం అనేది జీర్ణ క్రియకి ఉపయోగకరిగా చెప్తారు.
Also Read:కాషాయ పండుగకు ఏర్పాట్లు షురూ