ఇటీవలి కాలంలో చాలా విషయాలపై ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎటాక్ చేస్తోంది. కానీ.. జనసేనాని మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. కేసినో వ్యవహారంపై గానీ, ఉద్యోగుల సమ్మెపై గానీ, జిల్లాల సంఖ్య పెంపు ఇలా అనేక విషయాలపై పెద్దగా స్పందించింది లేదు. కానీ.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాత్రం రియాక్ట్ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్ వేస్ట్ అని తేల్చేయగా.. పవన్ మాత్రం శభాష్ అంటూ పొగిడేశారు. తెలుగు రాష్ట్రాలకు ఏ ఒక్క ప్రాజెక్టుగానీ, ఆర్థికంగా ఆదుకునే అంశం బడ్జెట్ లో లేకపోయినా కూడా సూపర్ అంటూ కితాబిచ్చారు. అటు ఏపీ సర్కార్.. కేంద్రంతో కయ్యం ఎందుకులే అన్నట్లుగా మధ్యేమార్గంగా స్పందించింది. కాంగ్రెస్, టీడీపీ తమదైన స్టయిల్ లో బడ్జెట్ ను వ్యతిరేకించాయి. తెలుగురాష్ట్రాల్లో పవన్ మినహా ఎవరికీ ఈ బడ్జెట్ నచ్చలేదు. బీజేపీతో ఉన్న పొత్తు కారణంగానే ఆయన ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు.
పీఆర్సీ విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలు ఏదో ఒక స్టాండ్ ను వినిపిస్తున్నాయి. కానీ.. పవన్ మాత్రం దాని గురించి ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగే జిల్లాలను పెంచుతూ జగన్ సర్కార్ ఈమధ్యే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 13ను 26 జిల్లాలుగా మార్చడానికి జీవోలను ఇచ్చింది. పైగా విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. అయితే.. దీనిపై వివాదం నడుస్తోంది. ఈ జిల్లాకు దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరు పెట్టాలని కాపు సామాజికవర్గం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అలాగే కొత్త జిల్లాలకు పలు పేర్లను ఆయా పార్టీలు సూచిస్తున్నాయి. ఈ విషయాలపైనా పవన్ పెద్దగా స్పందించింది లేదు. జనసేనకు చెందిన వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు మినహా పార్టీ పరంగా ఎక్కడా క్లియర్ కట్ గా స్పందన లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీలో ఎన్నో విషయాలపై మౌనంగా ఉన్న పవన్.. కేంద్ర బడ్జెట్ పై సానుకూలంగా స్పందించడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతున్నారు విశ్లేషకులు. విభజన చట్టంలోని అంశాలు బడ్జెట్ లో ప్రస్తావించలేదు.. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, లోటు బడ్జెట్.. ఇలా ఏ అంశాల గురించి మాట్లాడలేదు.. అలాంటి బడ్జెట్ ను పవన్ అద్భుతమని చెప్పడం చూసి పెదవి విరుస్తున్నారు.