– గులాబీల ముందస్తు రాగం
– కేంద్రాన్ని రద్దు చేయాలంటూ సవాళ్లు
– నిజంగా రద్దు చేస్తే…
– సత్తా చాటే దమ్ము టీఆర్‌ఎస్ కు ఉందా?
– 2014లో వచ్చిన సీట్లు ఎన్ని?
– 2019కి దిగజారిన సీట్లు ఎన్ని?
– 2024లో వచ్చేవి ఎన్ని?
– రాష్ట్రంలో వ్యతిరేక పవనాల సంగతేంటి?
నడ్డా.. అమిత్ షా.. మోడీ.. ఎవరు రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. దీన్నిబట్టి తెలంగాణపై బీజేపీ ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్థం అవుతోంది. అయితే.. కాంగ్రెస్ మాత్రం ఆ రెండు పార్టీలు కలిసి తమను తొక్కేయడానికి చేస్తున్న కుట్ర అని విమర్శలు చేస్తున్నా.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ లో జరుగుతోంది. మొన్న నడ్డా, షా వచ్చినప్పుడుగానీ.. ఇప్పుడు మోడీ రాక తర్వాత గానీ.. గులాబీ నేతల నుంచి వస్తున్న మాట ఒకటే. అదే.. ఎన్నికలకు వెళ్దాం.
దమ్ముంటే కేంద్రాన్ని రద్దు చేయడం.. ఎన్నికలకు వెళ్దామని సవాల్ చేస్తోంది టీఆర్‌ఎస్. ఏ ధైర్యంతో గులాబీ నేతలు ఇలా మాట్లాడుతున్నారనేది పక్కకు పెడితే.. సాధ్యాసాధ్యాలపై రాజకీయ పండితులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. 2014, 2019లో టీఆర్‌ఎస్ సాధించిన ఎంపీ స్థానాలు.. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను వివరిస్తున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటే.. 2014లో టీఆర్‌ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. అదే.. 2019కి వచ్చేసరికి 9 స్థానాలకు దిగజారిపోయింది. 2024లో ఆ సీట్లన్నా వస్తాయా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి.
ప్రస్తుతం జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్నారు కేసీఆర్. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని నానా తంటాలు పడుతున్నారు. ఎవరూ కలిసి రాకపోయినా.. రాష్ట్రపతి ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ లేని కూటమి అంటే సాధ్యం కాని పని. యూపీఏ కూటమిలోని పార్టీలు కేసీఆర్ ను నమ్మి బయటకు రావడం జరగని పని అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇటు చూస్తే హస్తం పార్టీ టీఆర్‌ఎస్ పై యుద్ధం ప్రకటించింది. వరంగల్ డిక్లరేషన్ అంటూ హడావుడి చేస్తోంది. అంటే కేసీఆర్ ఫ్రంట్ కు కాంగ్రెస్ దూరమే. దీన్నిబట్టి యూపీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కూడా దూరమైనట్టేనని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రస్తుతానికి కేసీఆర్ మాట చెల్లినా.. కూటమి విషయంలో మాత్రం అనుకున్నవి జరిగే ఛాన్స్ లు చాలా తక్కువేనని అంటున్నారు. మరి.. ఏ ధైర్యంతో టీఆర్‌ఎస్ నేతలు కేంద్రాన్ని రద్దు చేయమని అడుగుతున్నారనే దానిపై విశ్లేషణ చేస్తూ.. ఏదో మోడీ వచ్చి తిట్టి వెళ్లారు.. మనమూ ఏదో ఒకటి అనాలనే ఉద్దేశం తప్పితే టీఆర్‌ఎస్ నేతల మాటల్లో పస లేదని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇక రాష్ట్రంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత భారీగానే పెరిగిందని.. టీఆర్‌ఎస్ నేతలు ఎక్కడ కనిపించినా నిలదీసే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు కాంగ్రెస్, బీజేపీ బలోపేతం కావడం తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి అటు జాతీయస్థాయిలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ కు చుక్కలు కనపడడం ఖాయమని అంటున్నారు. కానీ.. ఈ విషయాలన్నీ తెలిసి కూడా గులాబీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విశ్లేషణ చేస్తున్నారు.