తెలంగాణలో ఇటీవల ప్రభుత్వ ప్రకటనలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. మొన్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులను ఆత్మరక్షణలో పడేసింది. వచ్చే ఏడాది నుంచి అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు గురించి నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తు్న ప్రతిసారి కేసీఆర్ సర్కార్ ఏదో ఒక కారణం చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని వాపోతున్నారు. ఐదేళ్లుగా టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్న ప్రతిసారి తమకు ప్రభుత్వం షాక్ లు ఇస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం చేసిన ప్రకటనపై కూడా టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ మరింత లేట్ చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తోందని అంటున్నారు.
నిపుణులు సైతం ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అంశంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలను గుర్తు చేస్తున్నారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేస్తామని 2020 బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ శపథం చేశారు. సీఎం ప్రకటనతో ఎంతో ఉత్సాహంగా వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ ల్లో చేరిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. అయితే.. అభ్యర్థుల్లో అసహనాన్ని గమనించిన ప్రభుత్వం ఈసారి మాట తప్పేది లేదని 25 వేల ఖాళీలు త్వరలోనే నింపేస్తామని 2020 డిసెంబర్13న మరోసారి ప్రటించారు. దీంతో మరోసారి నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. ఇంతలోనే 2021 మార్చిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు రావడంతో.. ఇదిగో ఎలక్షన్ తరవాత టీఆర్టీ నోటిఫికేషన్ వేస్తామని ప్రచారాన్ని ఊదరగొట్టారు. తరువాత 2021 జూలైలోనూ నూతన జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత ఖాళీల భర్తీ చేస్తామంటూ హడావుడి చేశారు.
ఆ హడావుడి ఎన్నో రోజులు లేదు. తరువాత మరో కారణం తెరపైకి తెచ్చారు. గత డిసెంబర్ లో కొత్తగా మరో రాగం ఎత్తుకున్నారు. జీవో 317ను తీసుకువచ్చి జిల్లాల వారీగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తే.. ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒక క్లారిటీ వచ్చేస్తే ఇక లేటేం ఉంటుంది.. ఇలా నోటిఫికేష్ ఇచ్చి.. అలా ఉద్యోగంలో కూడా తీసుకుంటాం అని చెప్పుకొచ్చారు. జీవో నెం.317 కూడా అరిగిపోయిన రికార్డు అయిపోయింది. మళ్లీ అదే మాట చెప్తే.. నిరుద్యోగులు నమ్ముతారో లేదో అని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. వచ్చే ఏడాది ఇంగ్లీష్ మీడియం అమలులోకి తీసుకొని వచ్చి.. అప్పుడు.. ఇంగ్లీష్ మీడియంలో ఎంత మంది కావాలి? తెలుగు మీడియంలో ఎంత మంది కావాలి? అని క్లారిటీ వచ్చిన తరువాత.. మొత్తం గంపగుత్తుగా నోటిఫికేషన్లే.. నోటిఫికేష్లన్లు అంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంగ్లీష్ మీడియం వెనక ఇంత కథ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఇంగ్లీష్ మీడియం అంశం తెరపైకి తీసుకొని వచ్చారని అంటున్నారు.
పోని ఈ ఇంగ్లీష్ మీడియం పేరుతో లేట్ చేసినా.. తరువాత అయినా నోటిఫికేషన్ ఉంటుందా? లేకపోతే.. ఇంగ్లీష్ మీడియం పేరుతో.. తెలుగు మీడియం అభ్యర్థులకు షాక్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇంగ్లీష్ మీడియం మొదలైతే.. ప్రస్తుతం తెలుగు మీడియంలో బోధిస్తున్న టీచర్ల ఉద్యోగాలకే గ్యారెంటీ ఉండదేమో అని ఆందోళన కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వారిని తొలగించకుండానే ఇంగ్లీష్ మీడియం తరగతులు బోధించేందుకు రిక్రూట్మెంట్ చేస్తామని విద్యాశాఖమంత్రి ప్రకటించారు. కానీ.. ఈ ప్రభుత్వ ప్రకటనలపై తమకు నమ్మకం లేదని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పింది నిజం అయినా.. కొత్త నోటిఫికేషన్లు మాత్రం అనుమానమే అని అభ్యర్థులు అంటున్నారు.
తెలుగు మీడియంకు సంబంధించి దాదాపు 18 వేల టీచర్ల పోస్టులు ఖాళీలున్నట్లు తెలుస్తోంది. వీటి కోసం ఐదు లక్షల మంది అభ్యర్థులు ఎందురు చూస్తున్నారు. వీరంతా ఈ ఇంగ్లీష్ మీడియం తమ కొంప ముంచుతుంది ఏమో అని భయపడుతున్నారు.