క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడానికి కారణమేమిటి ? ఈ ఘటనలో పంత్ చెబుతున్నదానికి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నదానికి తేడా కనబడుతోంది. . పంత్ ను డెహ్రాడూన్ ఆసుపత్రిలో పరామర్శించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి…. ఆ హైవేలో గుంత ఉన్న కారణంగా దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యానని పంత్ చెప్పాడని తెలిపారు.
కానీ ఆ రోడ్డులో గుంతలు లేవని, పంత్ కారు అక్కడికి వచ్చేసరికి ఆ హైవేకి పక్కనే ఉన్న చిన్న కాలువ దగ్గర ఓ సందులో యాక్సిడెంట్ కి గురైందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూర్కీ డివిజన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ గుసెన్ చెబుతున్నారు. ఈ కాలువను ఇరిగేషన్ కోసం వినియోగిస్తున్నారన్నారు. ప్రమాదం జరిగిన స్పాట్ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయన్న వార్తను ఆయన తోసిపుచ్చారు.
అయితే గుంత వంటిదానినో లేక మరో అవరోధాన్నో తప్పించబోయి పంత్ తన వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని ధామి .. మీడియాకు చెప్పారు. క్రికెటర్ తనకిదే విషయాన్ని చెప్పాడన్నారు. గత శుక్రవారం తెల్లవారు జామున హైవేలో ఓ గుంతను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ అంటున్నారు. ఇంతకీ ఆ మార్గంలో పాట్ హోల్ ఉందా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు.
ఈ యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ ను రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించిన స్థానికులను ప్రభుత్వం ప్రశంసించింది. వారిని జనవరి 26 రిపబ్లిక్ డే నాడు సత్కరించనుందని తెలుస్తోంది.