ఎన్టీఆర్ బయోపిక్ కాంట్రవర్సీ దగ్గర మొదలైన వర్మ ట్వీట్ల కథ కంటిన్యూ అవుతోంది. ఛాన్సు దొరికినప్పుడల్లా చంద్రబాబు బృందంపై చెలరేగుతున్న డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ తాజాగా డ్రోన్ ఎపిసోడ్‌పై కూడా విమర్శల్ని ఎక్కుపెట్టి వదిలారు. కృష్ణానది వరద కరకట్టను ముంచెత్తిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి మీదకు డ్రోన్లను వదిలిన ఘటన వివాదాస్పదం కావడంపై వర్మ స్పందించారు. తన ఇంటిపై డ్రోన్లు ఎగురుతున్నందుకు సీబీఎన్ ఎందుకు ఆందోళన చెందుతున్నాడు? ఆయనేమైనా ఒసామా బిన్ లాడెన్ లాంటివాడా? లేదా తన పెరట్లో ఏదైనా దాచుకున్నాడా? ఊరకనే అడుగుతున్నా..’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
చంద్రబాబు ఇల్లు పరిసర ప్రాంతాలపై వరద తీవ్రతను అంచనా వేసేందుకు కొంతమంది అత్యుత్సాహంతో డ్రోన్లు ప్రయోగించడం పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఇలా డ్రోన్లను వదలడం సరికాదంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుట్ర పూర్వకంగానే చంద్రబాబు ఇంటిపైకి డ్రోన్లను వదిలారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
డ్రోన్ వివాదంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించి.. ఇక్కడితో ఈ మేటర్‌కు ఫుల్ స్టాప్ పెడితే మంచిదని సలహా ఇచ్చారు. ఇలావుంటే, వర్మ తమ నాయకుడిని ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా తీసుకున్నాయి. వర్మ తమ నాయకుడిపై ద్వేషం పెంచుకుని అర్ధం పర్ధం లేకుండా ప్రతి చిన్న విషయానికి బురద జల్లుతున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒక అంతర్జాతీయ ఉగ్రవాదితో పోల్చడం.. పెరట్లో ఏదైనా దాచుకున్నారా అని ఎద్దేవాచేయడం వర్మ నోటిదురుసుకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడ్డమేనా అని దుయ్యబడుతున్నారు.