కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పై భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ఆమెను ‘డార్లింగ్’ అని సంబోధిస్తున్నట్టుగా ఆయన చేసిన వివాదాస్పద కామెంట్ పట్ల బీజేపీ నేతలు మండిపడ్డారు. కానీ శ్రీనివాస్ మాత్రం తన వ్యాఖ్యను సమర్థించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఢిల్లీలో పార్టీ నిర్వహించిన సత్యాగ్రహం సందర్భంగా ఆయన.. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావించారు.
వంట గ్యాస్ సిలిండర్ ధర . .2014 లో 400 రూపాయలుండగా ‘అబ్బో! చాలా ఖరీదే’ అని ఆమెఅప్పట్లో ఆరోపించారని, కానీ ఇప్పుడు దీని ధర 1100 రూపాయలకు పెరిగితే ఆ ‘ఖరీదు’ ఆమెకు ‘డార్లింగ్’ గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు నేను వ్యాఖ్యానించిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఇండియాలో ధరల పెరుగుదలకు బీజేపీ కారణమని దుయ్యబట్టిన శ్రీనివాస్.. నిత్యావసర వస్తువుల ధరలంటేనే ‘బీజేపీ’ కి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.
ఇప్పుడు స్మృతి ఇరానీ వంటివారు ఈ ‘ద్రవ్యోల్బణాన్నే ‘డార్లింగ్’ గా మార్చుకుని తమ బెడ్ రూముల్లో కూర్చుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆయనను తప్పు పడుతూ ఇలాంటి కామెంట్లు అసభ్యంగా ఉంటున్నాయని అన్నారు.
ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడే మాటలేనా ఇవి అని నిప్పులు చెరిగారు. ఒక మహిళా మంత్రిని ఉద్దేశించి శ్రీనివాస్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, అమేథీలో స్మృతి ఇరానీ… మీ నేత రాహుల్ గాంధీని ఓడించినందుకు నిరాశా నిస్పృహలతో ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే. ఆంటోనీ కుమారుడు, మాజీ కాంగ్రెస్ నేత అనిల్ ఆంటోనీ కూడా శ్రీనివాస్ కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. ఇది సిగ్గుచేటని ఆయన ట్వీట్ చేశారు. .