ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయలు దేరారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు కేసీఆర్‌తో భేటీ కావాలని ఆమె ప్రయత్నించగా వీలు కాలేదని తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌తో ఆమె ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం.
ఆ 15 నిమిషాల వ్యవధిలో వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగివుంటుందన్న దానిపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈడీ నోటీసులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆమెకు సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.
ధైర్యంగా ఢిల్లీకి వెళ్లాలని, నువ్వు చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించని ఆయన మార్గనిర్దేశనం చేసినట్టు సమాచారం. నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అయ్యేలా చూడండని, బీజేపీ ఆకృత్యాలపై న్యాయ పోరాటం చేద్దామని సూచించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా సహాయంగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చినట్టు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలో ఆమె ఢిల్లీకి బయలు దేరినట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రేపు విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు పంపించింది. అయితే ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో తాను రేపు విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఆమె లేఖ రాశారు.
విచారణకు తాను ఈ నెల 15న హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. కానీ దానికి ఈడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె ఢిల్లీ బయలు దేరారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది.