– ఫాంహౌస్ లో 16 రోజులు..
– కేసీఆర్ ఏం చేశారు?
– ప్రకాష్ రాజ్ ని పిలిపించి చర్చలు జరిపారా?
– జాతీయ సమస్యలపై ఫోకస్ పెట్టారా?
– అది నిజమే అయితే…
– రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి..
– జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం ఏంటి?
– కేసీఆర్ ను పంజాబ్ సీఎం ఎందుకు రావొద్దంటున్నారు?
– రాజకీయ పండితుల విశ్లేషణ
కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి బయలుదేరాడంట.. కేసీఆర్ తీరు చూస్తుంటే గట్లనే ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఓవైపు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. వర్షానికి అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అటుచూస్తే.. జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చి నానా తిట్లు తిట్టి వెళ్లిపోతున్నారు. కానీ.. కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్న 16 రోజులు ఏం చేశారయ్యా అంటే జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారనే టాక్ నడుస్తోంది.
ఫాంహౌస్ లో ఉన్నన్నాళ్లూ పాలనకు సంబంధించి కేసీఆర్ ఎవరినీ కలిసినట్లు లేదని అంటున్నారు విశ్లేషకులు. కానీ.. జాతీయ రాజకీయాల కోసం మాత్రం ప్రకాష్ రాజ్ ను పిలిపించుకుని ముచ్చట పెట్టారని చెబుతున్నారు. ఈక్రమంలోనే జాతీయ స్థాయిలో సమస్యలపై ఆయన ఫోకస్ చేశారని.. రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులతో పలు దఫాలు చర్చలు జరిపి.. నదుల అనుసంధానం, ఇతర రాష్ట్రాల్లో వాటర్ సమస్యలపై వివరాలు సేకరించినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే.. ఏపీతోనే తెలంగాణకు జలాల విషయంలో కొట్లాట జరుగుతోంది. అసలు.. కృష్ణాజలాల్లో అన్యాయం జరగడానికి కేసీఆరే కారణం అని ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు చేస్తున్నాయి. అలాంటిది.. ఇతర రాష్ట్రాల్లో వాటర్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ బయలుదేరడం ఈ ఏడాది బెస్ట్ జోక్ గా అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
కేసీఆర్ జాతీయ రాగం అందుకున్నప్పటి నుంచి బలంగా వినిపిస్తున్న ప్రశ్న.. “ఆయనతో కలిసి వచ్చేదెవరు?”. ఈ విషయంలో కేసీఆర్ కు గతంలో పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా ముందుకువెళ్తూ పలువురు నేతల్ని కలిశారు. ఈక్రమంలోనే కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. ఉద్యమంలో చనిపోయిన రైతులకు సాయం చేస్తానని ప్రకటించారు. లిస్ట్ కోసం రాకేష్ టికాయత్ తో సమావేశం కూడా జరిపారు. కానీ.. వివరాలు పూర్తిగా సేకరించలేకపోయారు. అయితే.. పంజాబ్ లో చనిపోయిన రైతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయాలని భావించగా.. అక్కడి సీఎం ససేమిరా అంటున్నారు. పంజాబ్ గడ్డపై కేసీఆర్ కు ఆప్ సర్కార్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందని చెబుతున్నారు విశ్లేషకులు.
కేసీఆర్ అంటే కేజ్రీవాల్ కు పడదనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఢిల్లీ పర్యటన సమయంలో కలిసేందుకు విముఖత చూపారని.. అదే సమయంలో తన పార్టీ నేత చేత కేసీఆర్ అవినీతిపరుడనే విమర్శలు చేయించారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ ఉంది. అలాంటిది తమ పార్టీ అధికారంలోకి ఉన్న రాష్ట్రానికి వెళ్లి కేసీఆర్ చెక్కులు పంచుతామంటే కేజ్రీవాల్ కు నష్టమేగా.. అందుకే ఆయన్ను అక్కడకు రానివ్వడం లేదని అనుకుంటున్నారు విశ్లేషకులు. ఇటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా కేసీఆర్ ను దూరం పెట్టేసినట్లే ఉన్నారని చెబుతున్నారు. అయినా కూడా కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల జపమే చేస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసి.. జాతీయస్థాయిలో సమస్యలపై ఫోకస్ చేయడం కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్తే… టీఆర్ఎస్ నేతలు బీజేపీ, కాంగ్రెస్ ను తిడుతున్న తిట్లే ఆయనకూ వర్తిస్తాయని గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే.. ఈమధ్య రాహుల్ గాంధీ, నడ్డా, అమిత్ షా.. తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో కేటీఆర్ నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. మరి.. జాతీయ రాజకీయాల మంత్రం జపిస్తున్న కేసీఆర్.. రేపు ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్తే ఆయన కూడా టూరిస్టే అవుతారుగా అని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని వదిలేసి.. జాతీయ రాజకీయాలపైనే జోరుగా చర్చలు జరిపారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే జరుగుతోంది.