అఖండ భారత్ అంశం ఇటీవల మరోసారి తెరపైకి వచ్చింది.రాబోయే 10 నుంచి 15 ఏండ్లలో అఖండ భారత్ వాస్తవ రూపం దాల్చుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
ప్రస్తుత వేగంతో ప్రయాణిస్తే రాబోయే 20 నుంచి 25 ఏండ్లలో అఖండ భారత్ కల సాకారం అవుతుందని తెలిపారు. కానీ ఇంకొంచెం వేగంగా ప్రయాణిస్తే 10 నుంచి 15 ఏండ్లలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.
ఈ మాటలతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది.దీంతో ఆర్ఎస్ఎస్ నేతలు కొంత వెనకడుగు వేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడింది సాంస్కృతిక కోణంలోనని, భౌగోళిక కోణంలో కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అఖండ భారత్ అంటే
బ్రిటీష్ పాలన కన్నాముందు ఉన్న భారత్ ను అఖండ భారత్ అంటారు. ఇందులో భారత్,పాకిస్తాన్,బంగ్లాదేశ్,మయన్మార్, టిబెట్,ఆఫ్ఘనిస్తాన్,శ్రీలంక,నేపాల్,భూటాన్ లు భాగంగా ఉండేవి. ఆర్ఎస్ఎస్ సాహిత్య పుస్తకాల్లో,సంఘ్ భావాలు గల చరిత్రకారులు రాసిన పుస్తకాల్లోనూ దీని ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తోంది.
అఖండ భారత్ పై ఆర్ఎస్ఎస్ ఏం చెబుతోంది
అఖండ భారత్ అనేది భారత్ పెద్దన్నగా ఉండే భారత్,దాని పొరుగుదేశాల సమాఖ్యగా సంఘ్ నేతలు అభివర్ణిస్తున్నారు.మన పొరుగు దేశాల భద్రత,శ్రేయస్సు భారత్ తో కనెక్ట్ అయి ఉన్నాయని సంఘ్ నేతలు చెబుతున్నారు.
ఎందుకంటే ఈ దేశాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాకుండా ఒకప్పుడు భరతవర్ష్ లో భాగంగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఆయా దేశాలు కలుసుకునే స్థానంగా భారత్ ఎదగాలని, ఈ విషయాన్నిఇతర దేశాలు గ్రహించేలా సహాయక పాత్రను భారత్ పోషించాలని కోరుకుంటున్నారు.
మారుతున్న రాజకీయ పరిస్థితులు
దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇవి అఖండ భారత్ ను సాధించేందుకు ప్రస్తుతం ఉన్నవాతావరణం ఉపకరిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘భారత విదేశాంగ విధానంలో ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి.ముఖ్యంగా 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని మోడీ పొరుగు దేశాలన్నింటిలో పర్యటిస్తున్నారు.ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు” అని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యకారిణి సభ్యుడు ఒకరు తెలిపారు.
అఖండ సమాఖ్యకు పొరుగు దేశాల మద్దతు
అఖండ భారత్ కావాలని పొరుగు దేశాలైన పాకిస్తాన్,బంగ్లా దేశ్ లు కోరుకుంటున్నాయని ఆర్ఎస్ఎస్ చెబుతోంది.ముఖ్యంగా ఇటీవల ఇండియా లాంటి ప్రజాస్వామ్యం కావాలని ఆ దేశాలు బహిరంగంగానే చెబుతున్నాయి. కరోనా సమయంలో మహాభారత్ రీ టెలికాస్ట్ చేస్తే 30 శాతం మెయిల్స్ పాక్ నుంచే వచ్చాయని, దీన్నిబట్టి చూస్తే పాక్ పౌరులు భారత సంస్కృతి పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోందని సంఘ్ నేతలు విశ్వసిస్తున్నారు.
త్వరలో అఖండ భారత్ సమాఖ్య
Advertisements
ఈ దేశాలన్నీఇప్పటికిప్పుడే భారత దేశ రాజకీయ పటంలో చేరుతాయని తాము చెప్పడం లేదని సంఘ్ నేతలు అంటున్నారు. కానీ అఖండ భారత్ భావన పొరుగు దేశాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోందని,కచ్చితంగా త్వరలోనే సాంస్కృతిక ఏకీకరణ జరుగుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఒక సమాఖ్య ఏర్పాటుకు అది దారి తీస్తుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.