2002లో గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రపై బీబీసీ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై ఇప్పటికే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. భారత్‌తో దౌత్య సంబంధాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కూడా స్పందించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. బీబీసీ డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదన్నారు. అమెరికా, భారత్ లు రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలని తెలిపారు. అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసన్నారు.
భారత ప్రజాస్వామ్యం చాలా శక్తివంతమైందన్నారు. రెండు దేశాలను కలిపి వుంచే వాటిపై తమ దృష్టి వుంటుందని పేర్కొన్నారు. రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేసే అంశాలను మాత్రమే తాము ఆలోచిస్తామన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్నారు..
ఇరు దేశాల ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో మోడీ పాత్రపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ తీసింది. ఆ అల్లర్లకు మోడీ బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలినట్టు పేర్కొంది.
‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’పేరుతో రెండు భాగాలుగా రూపొందించింది. ఇందులో మొదటి ఎపిసోడ్ ను బీబీసీ యూట్యూబ్ లో విడుదల చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే దీన్ని కేంద్ర ఐటీ శాఖ తొలిగించింది.