బైడెన్ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉక్రెయిన్ కు సహాయం చేయడంపై బైడెన్ ప్రభుత్వం అధిక ఆసక్తి చూపిస్తోందని మండిపడ్డారు.
ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు బైడెన్ అధిక నిధులు కేటాయిస్తున్నారని, దాని బదులుగా అమెరికాలోని పాఠశాలల భద్రతను పెంచేందుకు వాటిని ఖర్చు చేయాలని ట్రంప్ అన్నారు.
ఇటీవల టెక్సాస్ లోని ఓ పాఠశాలలో ఓ ఉన్మాది కాల్పులు జరిపిన ఘటనలో సుమారు 20 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అనే సంస్థ హోస్టన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ట్రంప్…. ఉక్రెయిన్ కు బైడెన్ బిలియన్ డాలర్లు సహాయంగా అందిస్తున్నారని, అలాంటప్పుడు మన ఇంట్లో పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు ఆ మాత్రం నిధులు కేటాయించి చర్యలు చేపట్టలేరా అని ప్రశ్నించారు.
ఇరాక్, ఆప్ఘనిస్తాన్ లో ట్రిలియన్ల డాలర్లను ఖర్చు చేశామని, కానీ దాని వల్ల అమెరికాకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. బయటి దేశాలను చక్కదిద్దడం కన్నా ముందు దేశంలోని స్కూల్ పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.