– హుజూరాబాద్ సీన్ రిపీట్ అవుతుందా?
– ఒక్కో నియోజకవర్గానికి 500 కోట్లు?
– గులాబీలకు సాధ్యం అయ్యే పనేనా?
– టీఆర్ఎస్ ఎన్నికల బడ్జెట్ ఎంత?
– ఇతర పార్టీల పరిస్థితేంటి..?
– రాజకీయ పండితుల విశ్లేషణ
కేసీఆర్ ఏం చేసినా లాభం లేకుండా చేయరని అంటుంటారు. 2014లో అధికారం చేపట్టిన సమయం నుంచి ఇప్పటిదాకా ఆయన ఆచరించిన నియమాలు.. తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లే. 80 వేల ఉద్యోగాలు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కేసీఆర్. మరి.. ఆయనకు ఇంత సడెన్ గా నిరుద్యోగులు ఎందుకు గుర్తుకొచ్చారా? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. కొందరు నిరుద్యోగులు అయితే.. మాకు నమ్మకం లేదు దొర అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఎప్పటి నుంచో నోటిఫికేషన్లు అంటూ కాలయాపన చేసి ఇప్పుడు 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటన చూసి.. వాళ్లు అలా అనుకోవడంలో తప్పులేదు. ఇన్నాళ్లు ఉద్యోగాలను కేసీఆర్ ఎన్నికల అస్త్రంగానే వాడుతున్నారనే అపవాదు ఉంది. అయితే.. తాజా ఉద్యోగ ప్రకటనకు కూడా మెయిన్ రీజన్ ముందస్తు ఎన్నికలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిరుద్యోగులు ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. తమకు నమ్మకం లేదని అంటూ.. ఇది ముమ్మాటికీ ముందస్తు ఎన్నికల స్టంట్ అని విమర్శిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకే వెళ్తారని అనుకున్నా.. అదేం టీఆర్ఎస్ కు లాభించేది కాదని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని వారు ఈ అంచనాకొచ్చారు. ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తీరును గుర్తు చేస్తున్నారు. ఈటలను ఓడించాలనే లక్ష్యంతో అధికారికంగా.. అనధికారంగా నియోజకవర్గంలో కోట్లు కుమ్మరించారు కేసీఆర్. దాదాపు 5 వందల కోట్ల వరకు ఖర్చు పెట్టారని రాజేందరే మీడియా ముఖంగా చాలాసార్లు విమర్శించారు.
ఆ సమయంలో ఒక్కో ఓటుకు 6వేల వరకు పంచారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే.. పది వేల వరకు అందాయని చెబుతుంటారు. ఇప్పుడు ముందస్తు వస్తే.. 119 నియోజకవర్గాల్లో హుజూరాబాద్ ఎక్స్ పెక్టేషనే ఉంటుంది. అప్పటి మాదిరిగా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చు పెట్టాలంటే తడిసి మోపడవుతుంది. అభ్యర్థులు అందరూ అంత భరిస్తారా? అంటే కష్టమనే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఖర్చు పెట్టినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో గులాబీలకు వచ్చే ఎన్నికలు ప్రాణగండమేనని అంచనా వేస్తున్నారు.
ఇదే క్రమంలో పార్టీల బడ్జెట్ ఎన్ని వందల కోట్లు ఉంటుందో అనే చర్చ కూడా జరుగుతోంది. ఒక్క హుజూరాబాద్ నియోజకర్గంలోనే 500 కోట్లు ఖర్చు చేశారంటే.. ఈ లెక్కన మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అదే స్థాయిలో ఖర్చుపెడితే.. 119 స్థానాలకు 59వేల కోట్లకు పైనే అవుతుంది. ఇన్నేళ్ల టీఆర్ఎస్ పాలనలో లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు దీనిపై తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్టుల పేరుతో భారీ కుంభకోణాలు జరిగాయని అంటుంటారు. అయితే.. టీఆర్ఎస్ స్థాయిలో ఇతర పార్టీలు ఖర్చు పెడతాయా? అంటే కుదరని పని అని చెబుతున్నారు విశ్లేషకులు. కాస్తో కూస్తో పెట్టి.. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మరింత పెంచి క్యాష్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.