
అందరి చూపు ఇప్పుడు హైకోర్టు వైపే. మూడు రాజధానులపై స్టే కొనసాగిస్తారా లేక.. ఎత్తేస్తారా? ఎత్తేస్తే.. విశాఖలో మరుసటి క్షణం నుంచే ప్రభుత్వం హడావుడి మొదలవ్వడం ఖాయం. ఎత్తకపోతే.. ప్రభుత్వం ఏం చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమరావతి రైతులు.. స్టే ఆర్డర్ ను కొనసాగించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. రేపు ఆ పిటిషన్లతో పాటు.. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను కూడా పరిశీలించాకే.. హైకోర్టు స్టే ఆర్డర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే ప్రభుత్వం మాత్రం తెలివిగా సరిగ్గా ఒక రోజు ముందు.. అమరావతిలోని నిర్మాణాలపై సమీక్షను నిర్వహించింది. సుమారు 15 వేల కోట్లు ఖర్చు పెట్టి.. నిర్మాణం మధ్యలో ఆగిపోయినవాటిని.. పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. మూడు రాజధానుల ప్రకటనకు పది రోజుల ముందు కూడా సరిగ్గా ఇలాంటి సమీక్షే చేసి.. సరిగ్గా ఇవే ఆదేశాలిచ్చారు. ఇప్పుడు కాస్త డీటెయిల్డ్ వివరాలు ప్రెస్ కు రిలీజ్ చేశారు. జనానికి ఆన్ లైన్ లో ఫ్లాట్లు అమ్మిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కంప్లీట్ చేయమన్నారు. అలాగే మిగతావి కూడా కంప్లీట్ చేయాలని.. ఆర్ధిక శాఖతో కలిసి ప్లానింగ్ చేసుకోవాలని చెప్పినట్లు వచ్చింది.
ఇప్పుడు ప్రభుత్వం రేపు అఫిడవిట్ లో ఖచ్చితంగా ఈ వివరాలు పెడుతుంది. అంటే అమరావతిని మేం నిర్లక్ష్యం చేయడం లేదని.. శాసన రాజధానిగా కంటిన్యూ అవుతుందని.. పనులు ఆపలేదని.. అభివృద్ధి ఆపలేదని.. వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడుతున్నామని సవినయంగా విన్నవిస్తుంది. అలా చెప్పడం కోసమే.. ఇలా సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు విశాఖకు వెళ్లటం కుదరకపోతే.. ఈ ఆదేశాలు మళ్లీ అటకెక్కడం ఖాయం.ఇప్పటికే ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు స్టే ఆర్డర్ ను ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్ వేసినా.. అది ఇప్పటివరకు విచారణకు రాలేదు. ఇప్పటికే హైకోర్టు విధించిన స్టే ఆర్డర్ సమయం ముగింపుకొచ్చింది. మొదట పిటిషన్ వేసినప్పుడు టెక్నికల్ గా తప్పులు చేయడంతో.. సవరించాలని చెప్పడం.. మళ్లీ సవరించి వేయడం జరిగింది. అయినా గురువారం కూడా విచారణకు రాలేదు. కాకపోతే శుక్రవారం హైకోర్టు ఒక వేళ స్టే ఆర్డర్ పొడిగిస్తే.. అప్పుడు సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది.ఏమైనా రాష్ట్రమంతా మాత్రం రేపు హైకోర్టు లో ఏం జరగబోతుందనేదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది.