– సీబీఐని పరేషాన్ చేస్తున్న ఫాంహౌస్ కేసు
– రేపు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం
– ఆరుసార్లు లేఖ రాసినా స్పందించని సీఎస్
– కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయనున్న సీబీఐ
– ముందే అంతా ప్రిపేర్ చేసుకున్న అధికారులు
– నందకుమార్ నుంచే విచారణ మొదలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధించినా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు ఇవ్వడం లేదు. సుప్రీం స్టే కు నిరాకరించినా బీఆర్ఎస్ సర్కార్ తగ్గడం లేదు. సిట్ వద్ద ఉన్న డీటెయిల్స్ అప్పగించాలని ఎస్పీ స్థాయి అధికారి సీఎస్ కి ఆరుసార్లు లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులు సుప్రీంను ఆశ్రయించారని వివరణ ఇస్తున్నారు. సుప్రీం స్టే కి నిరాకరించి తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. శుక్రవారం ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని రేపటి విచారణ తర్వాత కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
గ్రౌండ్ క్లియర్ చేసుకున్న సీబీఐ
ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్, ఆనాటి ఫుటేజీని పరిశీలించారు. సీఏం వద్దకు ఎవరు చేరవేశారో కాల్ డేటా, టవర్ లొకేషన్స్ పరిశీలించారు. పోలీస్ అధికారుల టైమింగ్స్, ఎమ్మెల్యేల స్పై కెమెరాలను సరిచూసుకున్నారు. టెక్నికల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఎవరెవరని విచారించాలో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పులోనే ముఖ్యమంత్రికి ఎలా వీడియోలు చేరాయో తేల్చాలని ఉండటంతో.. కేసీఆర్ ని విచారించేందుకు ఎలాంటి పక్రియ ఉంటుందో సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
నందకుమార్ స్టేట్ మెంట్ కీలకం
ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్ల రూపాయలు సమకూరుస్తామని చెప్పిన నందకుమార్ ను మొదటగా సీబీఐ విచారించనుంది. ఎలా ప్లాన్ చేశారు.. ఎవరెవరిని కలిశారో స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాతనే అందరికీ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది.
పోలీసుల మెడకు చుట్టుకుంటున్న కేసు
పోలీస్ అధికారుల అత్యుత్సాహం సీబీఐ విచారణను ఎదుర్కొనేలా చేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రికి వీడియోలు మీడియా ద్వారా అందాయా? మీడియాకు ఎవరు లీక్ చేశారు. కోర్టులో ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు ఎలా వెళ్లింది? ఇలా అనేక విషయాలపై సీబీఐ ప్రధాన దృష్టి పెట్టింది. సిట్ దర్యాప్తులో ఏమైనా సాక్ష్యాధారాలు తారుమారు అయితే.. వాటన్నింటిపై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులను విచారించే అవకాశం ఉంది.